బాలీవుడ్ దర్శకుడు విదు వినోద్ చోప్రా నిర్మించిన ‘శికర’ సినిమా చూస్తూ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా చివరలో ఉబికి వస్తున్న కన్నీటిని కనురెప్పల మాటునే దాచుకున్నారు. ఇది గమనించిన నిర్మాత విదు వినోద్ చోప్రా అతని సీటు దగ్గరకు వెళ్లి మోకాళ్లపై కూర్చొని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జమ్మూ కశ్మీర్ లో 1990 ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో కశ్మీర్ పండిట్లపై హింస కొనసాగింది. ఎంతో మందిని పండిట్లను హత్య చేశారు. మహిళలపై అత్యాచారం చేశారు. ఉగ్రవాదులు డెడ్ లైన్ విధించడంతో సర్వం అక్కడే వదిలేసి కట్టు బట్టలతో బతుకు జీవుడా అంటూ లక్షలాది మంది కశ్మీర్ పండిట్లు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. కశ్మీరీ పండిట్ల జీవిత కధ ఆధారంగా నిర్మించిన ‘శికర’…ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీరీ పండింట్స్… శుక్రవారం విడుదలైంది.
ఈ సినిమాలో సాదియా, ఆదిల్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించగా…ఎ.ఆర్. రహమాన్ సంగీతం సమకూర్చారు. నిర్మాత, దర్శకుడు విదు వినోద్ చోప్రాకు సినిమా కథ చాలా దగ్గరగా ఉంది. ఆయన కుటుంబం కూడా ఉగ్రవాదుల భయంతో జమ్మూ కశ్మీర్ నుంచి వలసపోయిందే.