నాడు దోస్త్ ! నేడు దుష్మన్ !!
ఏపీలో వైసీపీ-బీజేపీ ఢీ
గుంటూరు: గత ఎన్నికల్లో టీడీపీని పతనం చేసేందుకు వైసీపీతో బీజేపీ చేతులు కలిపిందా? అప్పట్లో దీనిపై ఎన్నో ప్రచారాలు జరిగాయి. కానీ ఇప్పుడు ‘బీజేపీ ఆంధ్రప్రదేశ్ @ బీజేపీ4 ఆంధ్ర’ పేరుతో ట్విట్టర్‌లో పెట్టిన పోస్టు చూస్తే ఇది నిజమేనని అనిపిస్తోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
‘మేము ఎన్నో ఆశలతో అధికారం కట్టబెడితే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం 3 నెలలకే తన అసమర్థతను చాటుకుంది. వై.సి.పి. కార్యకర్తల అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. ప్రజాస్వామ్యానికి నీళ్లొదిలి, పోలీసు రాజ్యానికి శ్రీకారం చుట్టింది…’ ఇది బీజేపీ ట్వీట్ సారాంశం.
దీని ప్రకారం వైసీపీ అధికారంలోకి రావడానికి బీజేపీ లోపాయికారిగా సహకరించి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు వైసీపీ తీరు వారికి నచ్చకపోవడంతో అసలు విషయం బయటకు వచ్చిందని కొందరు వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులలో బీజేపీ ఏమిచేస్తుంది..? మాట వినని వైసీపీని కంట్రోల్ చేస్తుందా ? తన దారికి తెచ్చుకుంటుందా ? ఎత్తుకు పైఎత్తు వేసి వైసీపీని దెబ్బతీస్తుందా ? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. స్టేట్‌లో బీజేపీ తీరు చూస్తుంటే ఏపీలో వైసీపీని ఎండగట్టి తాను బలపడేందుకు చర్యలు చేపట్టినట్లు అర్ధమవుతుంది. కానీ, ఢిల్లీలో అంత సీన్ లేదు. ప్రస్తుతానికి తెలంగాణ వైపు మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో జగన్‌తో సంబంధాలు అంత సయోధ్యగానూ లేవు. అలా అని దూరంగానూ లేవు. అంటీముట్టని సంబంధాలు వున్నాయి. విజయసాయిరెడ్డి మాత్రం ఢిల్లీలో బాగా బలపడ్డారు. ఎంత బలపడ్డారంటే.. ఆ పార్టీ అధినేతకు ఆల్టర్‌నేటీవ్‌గా బీజేపీ నాయకత్వం భావించేంతగా..!