– మెగా దావత్ పై బీజేపీ మౌనం?
– భారీ విరాళమే కారణమా?
ప్రభుత్వ అధికారి రజత్ కుమార్ కుమార్తె పెళ్లి బిల్లుల వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కయి ప్రజల సొమ్ము దోచేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ మెగా బంధంపై న్యాయ విచారణకు సైతం డిమాండ్ చేశారు. అయితే.. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అని దూకుడు మీదున్న బీజేపీ మాత్రం సైలెంట్ గా ఉంటోంది. రజత్, మెగా ఇష్యూలో మౌనంగా ఉంటున్నారు కమలనాథులు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రజత్, మెగా వ్యవహారంపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదనే దానిపై చర్చ జరుగుతూ అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్న ఎన్నికల ట్రస్ట్ లో ఒకటైన న్యూఢిల్లీకి చెందిన ప్రుడెంట్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ కంపెనీల నుంచి రూ.245.72 కోట్ల ఫండింగ్ చేసింది. అందులో అధిక మొత్తంలో రూ.209 కోట్లు బీజేపీకి విరాళాలు వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన మూడు కంపెనీలు విరాళం ఇవ్వగా అందులో మెగా సంస్థదే అగ్రభాగం.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మెగా కంపెనీ బీజేపీకి ఏకంగా రూ.22 కోట్ల విరాళం అందించింది. అలాగే కేఎంవీ ప్రాజెక్ట్ కన్ స్ట్రక్షన్ కంపెనీ రూ.1.5 కోట్లు, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ డెవలపర్స్ లిమిటెడ్ గ్రూప్ కోటి రూపాయల విరాళం ఇచ్చినట్లు ఏడీఆర్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
బీజేపీకి మెగా సంస్థ విరాళం ఇవ్వడంపై బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ట్విట్టర్ లో తనదైన స్టయిల్ లో ఎటాక్ చేశారు. “మెగా సంస్థ బీజేపీకి ఇటీవల రూ.22 కోట్ల విరాళం ఇచ్చిందట! ఇందుకేనా తెలంగాణ బీజేపీ మెగా దావత్ స్కాండల్ విషయంలో మౌనంగా ఉంది?. తెలంగాణ ప్రజలారా, ఇకనైనా మన ఏనుగుకు ఓటేసి ఈ మాఫియా సంస్కృతికి చరమగీతం పాడుదాం” అంటూ ఆరోపించారు ఆర్ఎస్పీ.
ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈయనే కాదు కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా ఇవే ప్రశ్నలు వస్తున్నాయి. రజత్ కుమార్ కుమార్తె పెళ్లి బిల్లుల అంశంపై బీజేపీ మౌనానికి కారణాలు ఇవేనా? అని ప్రశ్నిస్తున్నాయి. అటు మెగా కృష్ణారెడ్డి వ్యవస్థలను ఎలా మ్యానేజ్ చేస్తారో ఈ దీన్నిబట్టి అర్థం అవుతోందని అంటున్నాయి.