అవును.. మీరు ఏమైనా చేయగలరు సామీ. మమ్మల్ని క్షమించాలి వీర్రాజు సామి.. ఇంతకు ముందు మీరు ఏదైనా అంటే.. వెంటనే అర్ధమయి చచ్చేది కాదు.. ఈ ఆరేళ్ల అనుభవంతో.. బాగా అర్ధమవుతుంది సామీ. అప్పుడు మీ నాయకుడు నరేంద్ర మోదీగారు.. ఢిల్లీని తలదన్నే రాజదాని అంటే మురిసిపోయాం సామీ.. కాని అది మీరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే .. అన్న ముక్క ఆయన మింగేశాడన్న సంగతి తర్వాత అర్ధమైంది సామీ. మీ ఎంకయ్యనాయుడు సామీ ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని పట్టుబడితే… చేతులెత్తి మొక్కాం సామీ.. కాని అది కూడా మీరు అధికారంలోకి వస్తేనే అన్న ముక్క మర్చిపోయాం సామీ. అంతుకు మించిన ప్యాకేజీ అంటే చంద్రబాబు కూడా నమ్మేశాడు సామీ.. కాని అది కూడా మీ చేతులతోనే అన్నసంగతి ఆయనకీ అర్ధం కాలేదు సామీ. ఇప్పుడు జిల్లాకో రాజదాని అంటే.. మళ్లీ ఎగిరి గంతేస్తామనుకుంటున్నారా సామీ.. తప్పు సామీ.. అట్టాంటిదిక జరగదు సామీ.. అది కూడా మీరు అధికారంలోకి వచ్చాకేననన సంగతి బాగా మా మెదళ్లుకెక్కిందిలే సామీ.. మీరు పత్యేకంగా చెప్పక్కర్లేదు సామీ.
అసలు రాజధాని అంటే అర్ధం మార్చేశారుగా సామీ. మీరు కాదులే.. అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు, తర్వాత చంద్రబాబు.. రాజధాని అంటే అభివృద్ధి అని.. అంతా ఇంకా దాని చుట్టూతా తిరగాలనే ఇదానం నిదానంగా అమలు చేసినా.. అదే అందరికీ చేటు తెచ్చింది కదా సామీ.. మీబోటి రాజకీయ పెద్దలంతా ఆ హైదరాబాదులోనే ఆస్తులు పెంచేసుకుంటే.. మాబోటోళ్లకు మిగిలింది నెర్రెలిచ్చిన నేల.. బర్రెలు గడ్డి తినే పొలాలేగా సామీ. అందుకేగా సామీ.. తెలంగాణలోని జనమంతా హైదరాబాద్ వస్తే చాలు.. అనుకుని భ్రమ పడి పత్యేక రాష్ట్రం కావాలని పోరి సాధించుకున్నారు గాని.. ఇప్పుడు వాళ్లకు కూడా అర్ధమైందిలే సామీ.. పేరు మారింది గాని.. మనుషులు ఆళ్ల బుద్ధులు మారలేదని.
ఇక చంద్రబాబు సామి అయితే రాజధాని అంటే అద్భుతమని.. ఇంద్రుడి రాజధాని అమరావతి అంటూ అదరగట్టేశాడు సామీ.. నిజమేనేమో.. అని అందరం ఆశ్చర్యపోయాం సామీ.. కాని ఆయన రైతుల దగ్గర భూములు తీసుకుని.. కంపెనీలకిచ్చి.. ఆ డబ్బులతో రాజధాని కట్టేయాలని రియల్టర్ ప్లాన్ వేశాడు సామీ.. ఎందుకంటే మీరు డబ్బులివ్వలేదు కాబట్టి.. కేంద్రమే నిధులిచ్చి కట్టిస్తామంటే.. భూములు తీసుకోవాల్సిన పనేముంది.. కంపెనీలు పిలవాల్సిన అవసరమేముంది.. ఏ సర్కారు భూముల్లోనే కట్టేయొచ్చు గందా సామీ రాజధాని.. ఇక ఆయన యవ్వారం అట్టా నడిస్తే.. ఇక జగన్ బాబు అయితే.. ఏకంగా మూడు రాజధానులంటున్నాడు కదా సామీ. అంటే ఆ మూడు అభివృద్ధి చెందితే చాలా.. మిగతా పది వద్దా.. అందుకే కదా మూడుకు ముందు మూటిచ్చి.. ఇప్పుడు పదమూడు కావాలనే గొడవ చేసి.. చంద్రబాబు పని అయిపోయింది.. ఇక జగన్ పని పడదాం అనే ప్లానులో మీరున్నారన్న సంగతి అర్ధమైంది సామీ.
ఒక్క అమరావతి ప్రాజెక్టు 50 వేల కోట్లు అయితే.. ముష్టి 2500 కోట్లు ఇచ్చిన మీరు పదమూడు రాజధానులంటే ఏడవాలనా నవ్వాలనా సామీ.. మా దగ్గర నుంచి పన్నుల సొమ్ములు వసూలు చేసుకుంటూ.. అవి తిరిగిస్తూ.. అవి కూడా ఏదో దయతలిచి ఇస్తున్నట్లు లక్షల కోట్ల లెక్కలు చెప్పే మీరు .. పదమూడేంటి సామీ మేం వింటామంటే ముప్ఫై మూడు కూడా కట్టేస్తారు సామీ..
అసలు అభివృద్ధి అనేది ఆఢ ఈఢ అని కాకుండా అన్ని చోట్ల ఉండాలి సామీ.. నీరు కావాల్సిన ప్రాజెక్టులు నదులున్న చోట.. అవి అవసరం లేనివి నీరు లేని చోట.. సముద్రంతో పని ఉన్నవి.. సాగరతీరంలోను.. అలా అన్ని చోట్ల ప్రాజెక్టులు పెట్టినా.. పెట్టించినా.. అభివృద్ది జరుగుతుంది సామీ. రాజధాని అనేది పరిపాలనా కేంద్రం సామీ.. అందరికీ అందుబాటులో ఉండేలా దానిని ఏర్పాటు చేసి.. పాలన మంచిగా జరగటానికే అది పెట్టుకోవాలి సామీ..అది వదిలేసి.. చంద్రబాబేమో అద్భుతమని.. జగనేమో మూడని.. మీరేమో పదమూడని.. మమ్మల్ని మోసం చేయొద్దు సామీ.. పాపం తగులుద్ది సామీ..