– సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమౌతున్న బీజేపీ
– హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహరచన
– ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్
– 144 స్థానాల్లో పట్టుకోసం ప్రణాళికలు
– రంగంలోకి ప్రధాని మోడీ
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోడీ దిగిపోతారని ప్రతిపక్షాలు తెగ తిట్టిపోస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అయితే.. మోడీని రావణాసురిడితో పోల్చారు. దీనిపై వివాదం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య యుద్ధం జరుగుతోంది. నిజానికి బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ లా మారారు మోడీ. ఆయనకున్న ఇమేజ్ పార్టీకి ఎంతో మేలు చేస్తోంది. అందుకే ఎక్కడ ఎన్నికలు ఉన్నా ఆయన రంగంలోకి దిగిపోతారు. ప్రజలను ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అవన్నీ వర్కవుట్ అయి.. ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుని బీజేపీ ప్రస్తుతం ఆర్థికం, నాయకత్వ పరంగా ఎంతో బలంగా రూపాంతరం చెందింది. ఇప్పటికే రెండు పర్యాయాలు విజయఢంకా మోగించిన కమలం పార్టీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయింది.
ఉత్తరాదిలో ఎంతో బలోపేతంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో అంతగా ప్రభావం చూపలేకపోతోంది. కర్ణాటక, తెలంగాణ మినహా మిగిలిన ఏపీ, తమిళనాడు, కేరళలో సీట్ల విషయంలో అసంతృప్తి ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాలు గెలిచిన బీజేపీ… ఈసారి అంతకుమించి నెగ్గాలని చూస్తోంది. ఈక్రమంలోనే దక్షిణాదిపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశం ఉద్దేశం లక్ష్యం అదే. గుజరాత్ ఎన్నికల్లో ఓటేశాక.. నేరుగా ఈ మీటింగ్ లోనే పాల్గొన్నారు మోడీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఈ భేటీ కొనసాగింది.
ఎన్నికల సన్నద్ధతలో భాగంగా రెండు రోజుల పాటు జాతీయ, రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ. పార్టీ జాతీయ కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జీలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. 2014, 2019 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు సాధించని నియోజకవర్గాల్లో ఈసారి పక్కా మెరుగైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు అగ్ర నేతలు. తక్కువ బలం ఉన్న నియోజకవర్గాల్లో 144 స్థానాలు దక్షిణాది రాష్ట్రాల్లోన్నే ఉన్నాయి. దీంతో.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా నియోజకవర్గాల్లో పాగా వేసేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
కర్ణాటక, తెలంగాణలో ఈసారి మెరుగైన ఫలితాలే ఉంటాయని అనుకుంటున్న బీజేపీ అధిష్టానం.. మిగిలిన రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టినట్టు అర్థం అవుతోంది. అయితే.. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు వేరు. డైరెక్ట్ గా పార్టీ బలోపేతం కావడం ఇప్పుడప్పుడే అయ్యే పని కాదనే అభిప్రాయం ఉంది. ఏపీ, తమిళనాడులో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది. ఆ రెండు చోట్ల ఏదో ఒక పార్టీతోనే వెళ్లాల్సిన పరిస్థితి. చూడాలి.. ఎన్నికల నాటికి బీజేపీ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో.