ప్రీతి కేసును ప్రభుత్వం.. పథకం ప్రకారమే నీరు గారుస్తోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అధికారులు పనిచేస్తున్నారని విమర్శించారు. నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రీతి ఎలా చనిపోయిందో ఇప్పటివరకు చెప్పలేదని అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ఒక రోజు దీక్ష చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సంజయ్.
చనిపోయిన ప్రీతి శవానికి నిమ్స్ లో 4 రోజుల పాటు చికిత్స అందించారని ఆరోపించారు. వరంగల్ లోనే ప్రీతి చనిపోయిందని, ఆమె శవానికి నిమ్స్ లో వైద్యం అందించి డ్రామాలాడారని మండిపడ్డారు. ప్రీతీది ఆత్మహత్య కానేకాదని.. ముమ్మాటికీ హత్యేనని అన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టులో ప్రీతి ఎలాంటి ఇంజక్షన్ తీసుకోలేదని వచ్చిందని గుర్తు చేశారు. ప్రీతి బ్లడ్ తీసేసి రిపోర్టును తారుమారు చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతోంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు బండి. అడబిడ్డలు చనిపోతుంటే కనీసం పరామర్శించటం లేదని.. ప్రగతిభవన్ నుంచి బయటకు రావటం లేదంటూ కేసీఆర్ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో క్రిమినల్స్ స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. నేరాలు, ఘోరాలు జరుగుతుంటే కనీసం రివ్యూ చేసే టైం కూడా సీఎంకు లేకపోవటం దౌర్భాగ్యమని విమర్శించారు.
ఎక్కువ నేరాలు చేసిన వాళ్లకు సన్మానాలు చేసే నీచ, నికృష్ణమైన ప్రభుత్వం నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సంజయ్. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు గుణపాఠం చెప్పే రోజులు వచ్చాయని.. బీజేపీ ప్రభుత్వం వస్తేనే మహిళలకు భరోసా వస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. చనిపోతే సంతాపం.. బతికుంటే పరిహారం లెక్కన బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు చేశారు. శవాలను ఎత్తుకెళ్లి రాజకీయం చేసే దుర్మార్గమైన.. నీచమైన స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి.