దేశాన్ని ఉద్దరించడానికి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టలేదని.. ఎలాంటి జెండా ఎజెండా లేకుండా కేవలం తాంత్రికుడి సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014లో సీఎం అయినప్పటి నుంచి కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు.
మొదటిసారి సీఎం అయ్యాక సచివాలయానికి వెళ్లిన కేసీఆర్.. కొందరు తాంత్రికులు హెచ్చరించారని ఆ తర్వాత అటు వైపు చూడలేదన్నారు సంజయ్. ఎన్ని క్షుద్ర పూజలు చేసినా ఇకపై ఆయన అనుకున్నవేం జరగవని హెచ్చరించారు. ఆఖరికి మునుగోడులో గెలిచేందుకు కూడా క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ లో డబ్బులు పంచినా గెలవలేదని.. ఇప్పుడు మునుగోడులో ఓటుకు 40వేలు పంచుతున్నారన్నారు. ప్రజలందరూ కేసీఆర్ చర్యలను గమనించాలని కోరారు.
మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి. అక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. గులాబీ ధన ప్రవాహం కొనసాగుతుందని.. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తిప్పుకోవాలని టీఆర్ఎస్ నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపించారు. పోలీస్, అధికార యంత్రాంగాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు సంజయ్. లిక్కర్ స్కాం విషయంలో తన కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అలాగే చీకోటి ప్రవీణ్ వ్యవహారాల్లో వచ్చిన ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని అడిగారు. టీఆర్ఎస్ నేతలు 2014లో ఇచ్చిన అఫిడవిట్లు, 2018 అఫిడవిట్లు.. ఇప్పుడున్న ఆస్తులపై వివరించే దమ్ముందా? అని సవాల్ చేశారు బండి సంజయ్.