– అమాయకులపై దాడులా?
– పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే..
– సీఎం, మంత్రులు స్పందించాలి
– గౌరవెల్లి వెళ్తాం.. బాధితుల్ని పరామర్శిస్తాం
– అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం..
– సర్కార్ పై బండి ఫైర్
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై విచక్షణారహితంగా పోలీసులు చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి దౌర్జన్యంగా ప్రవర్తించిన పోలీసుల తీరుపై మండిపడ్డారు. నిర్వాసితులపై దాడి చేసిన పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు బాధితులపై టీఆర్ఎస్ సర్కారు కక్షగట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన వారికి చట్టపరంగా అందాల్సిన పరిహారం ఇవ్వకుండా వాళ్లపై దాడి చేయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులని చూడకుండా విచక్షణారహితంగా దాడికి తెగబడటం దారుణమని ఫైరయ్యారు. టీఆర్ఎస్ గూండాలను రైతులపైకి ఉసిగొల్పుతారా? ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశ రాజ్యమా? అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు.
హుస్నాబాద్ గూడాటిపల్లె, హుస్నాబాద్ లో పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరింపజేయాలని,.. లేనిపక్షంలో జరగబోయే తీవ్ర పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంజయ్ హెచ్చరించారు. పేదలను రాచి రంపాన పెడుతున్నారని ఆరోపించారు. ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం వారిని ఒప్పించి మెప్పించాలి కానీ.. రాత్రికి రాత్రి ఇళ్లు ఖాళీ చేయించడం, విచక్షణా రహితంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు.
ఈ ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రులు స్పందించకపోవడం దారుణమన్నారు. బీజేపీ బృందం గౌరవెల్లి వెళ్లి బాధితులను పరామర్శిస్తుందని తెలిపారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు బండి సంజయ్.
సోమవారం పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ మంగళవారం హుస్నాబాద్ బంద్ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు తమ గోడు పట్టడం లేదంటూ బాధితులు క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు, భూనిర్వాహితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాడుల దాకా వెళ్లింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘర్షణలో కొందరు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆందోళనలను అదుపు చేసేందుకు యత్నించిన హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ఎస్‌ఐ శ్రీధర్ కు కూడా గాయాలయ్యాయి. నిర్వాసితులను పోలీసులు చెదరగొట్టారు. ఆ తర్వాత హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు, గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల మధ్య తోపులాట జరిగింది. ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన గుడాటిపల్లి నిర్వాసితులు పోలీస్ట్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.