తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) కార్యాలయం దగ్గర బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన నోటిఫికేషన్లకు సంబంధించి పేపర్లు లీక్ కావడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
పరీక్ష పత్రాలను అమ్ముకుంటూ నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. కార్యాలయం బోర్డును ఆందోళనకారులు పీకేశారు.
ఈ క్రమంలో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి బలవంతంగా వారిని తీసుకు వెళ్లారు. అప్పులు తెచ్చుకుని కోచింగ్ లు తీసుకుని, ఏండ్ల తరబడి కష్టపడి చదవుతున్న విద్యార్థులను ఇలా పేపర్లు లీక్ చేసి మోసం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పేపర్ లీకేజీలు ప్రగతిభవన్ డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయంటూ విద్యార్థులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పరీక్షా పత్రాలను కూడా కాపాడుకోలేనప్పుడు టీఎస్ ఎఎస్పీ బోర్డు ఎందుకని విద్యార్థులు ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్ కనుసన్నల్లోనే లీకేజీ నడిచిందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.