బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడో ఓచోట రెండు పార్టీల మధ్య ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లోనూ యుద్ధానికి దిగారు బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు.
నేతాజీ 125వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుకుంది. కానీ.. బెంగాల్ లోని భట్పారా ప్రాంతంలో మాత్రం తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. నేతాజీ జయంతి నేపథ్యంలో భట్పారాలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
కార్యక్రమం మంచిగా కొనసాగుతుంది అనుకునేలోపు.. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ మొదలైంది. అదికాస్తా పెద్దదై ఘర్షణకు దారితీసింది. కాసేపట్లోనే ఒకరినొకరు తోసుకుని రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది.
పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్చారు.