రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనేది టీఆర్ఎస్ వాదన. ఇన్నాళ్లూ కేంద్రానికి వంతపాడుతూ వచ్చి ఇప్పుడు యుద్ధం అంటుంటే అంతా డ్రామాగా అనిపిస్తోందనేది ప్రతిపక్షాల ఆరోపణ. 2014లోనే రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకా మంజూరు చేయట్లేదని.. కొత్త లైన్లు వేయడం లేదని ఇప్పుడు మాట్లాడడంపై విమర్శలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితమే కేంద్రం మహారాష్ట్రకు మంజూరు చేసినప్పుడు కాకుండా ఇప్పుడు నెత్తికొట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటనే ప్రశ్న తెరపైకి వస్తోంది.
కొద్ది రోజుల క్రితం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ లేఖ రాశారు. రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ ఆరోపణలపై కేంద్రం నుంచి రివర్స్ ఎటాక్ ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో అమలు అవుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనందు వల్లే ఆలస్యం అవుతోందని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
2014-15లో రూ.250 కోట్లు ఉన్న బడ్జెట్.. 2021-22కి రూ.2,420 కోట్లకు చేరిందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులను లెక్కలతో సహా లేఖలో వివరించారు.
DO to CM, Telangana on Pending Rly Projects.