ఎన్నికలకు ఇంకో నెల రోజుల టైమే ఉంది అన్నట్లుగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుల నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా సవాళ్లు, విమర్శలతో హీటెక్కిస్తున్నారు. ఓసారి రైతు సమస్యలు.. ఇంకోసారి ఉద్యోగుల బాధలు.. మరోసారి నిరుద్యోగుల వెతలు.. ఇలా ప్రతీ అంశంపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా గిరిజనుల చుట్టూ రాజకీయం నడుస్తోంది.
గిరిజనులకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని మంత్రి సత్యవతి రాథోడ్ బండి సంజయ్ కు సవాల్ చేశారు. రాష్ట్రంలో గిరిజనులకు, దళితులకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఎంపీ మాలోత్ కవిత అయితే ఓ అడుగు ముందుకేసి బండి సంజయ్ పై కాస్త ఘాటుగా స్పందించారు. అయితే.. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై బీజేపీ సైడ్ నుంచి దీటైన కౌంటర్సే వచ్చాయి. బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందిస్తూ… సత్యవతి రాథోడ్ కు అటవీ హక్కుల చట్టం గురించి కనీస అవగాహన లేదని చురకలంటించారు.
సత్యవతి రాథోడ్ 4వ తరగతి మాత్రమే చదివినట్లున్నారు.. అందుకే ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని కౌంటర్ ఎటాక్ చేశారు సోయం. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ గురించి మంత్రి తెలుసుకుంటే మంచిదని సెటైర్లు వేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించి పట్టాలు అందజేస్తామని గత ఆరేళ్లుగా కేసీఆర్ ఆదివాసీలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. కమిటీ పేరుతో మరోసారి అదే చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికలయ్యాక ఏజెన్సీ ఏరియాకు వెళ్లి కుర్చీ వేసుకుని కూర్చుని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్ హామీ ఏమయిందని ప్రశ్నించారు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్. అపాయిట్ మెంట్ కూడా ఇవ్వని సీఎం.. గిరిజనులకు చేసిందేమీ లేదన్నారు. 317 జీవో విషయంలో గిరిజన ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. ఈ అంశంపై దీక్ష చేసిన బండి సంజయ్ పై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఇసుక సరఫరాలో ఆదిలాబాద్ జిల్లా కో రూల్ ఇతర జిల్లాలకు ఒక రూల్ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు టీఆర్ఎస్ కు తొత్తుల్లా పనిచేస్తున్నారని.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ నేతలు దోచుకోవడం… దాచుకోవడమే తప్ప గిరిజనులకు చేసింది శూన్యమని విమర్శించారు రమేశ్ రాథోడ్. రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అని.. అధికారంలోకి రాగానే గిరిజన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.