బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య ఏడేళ్లుగా సాగుతున్న రహస్య ప్రేమాయణం.. తాజాగా మోడీ, అమిత్ షాలతో కేసీఆర్ భేటీ కావడంతో మరోసారి బయటపడింది అంటున్నారు రాజకీయ పండితులు. పైకి మాత్రమే ఒకరిని ఒకరు దూషించుకుంటారే తప్ప.. లోలోపల ఒకరికి ఒకరు సహకారాన్ని అందించుకుంటారనే విషయం మరోసారి తేటతెల్లమైందని చెబుతున్నారు. గత ఏడేళ్లుగా ఇదే జరుగుతుంది అని గుర్తు చేస్తున్నారు. పార్లమెంట్‌లో మోడీ ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికీ టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు మొదలు జీఎస్టీ, 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లు.. ఇలా అన్నింటికీ మద్దతు ఇస్తూ వచ్చిందే తప్ప, టీఆర్ఎస్ ఏనాడు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు అని రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా నష్టం అనుకుంటే తటస్థంగా ఉందే తప్ప మోడీ వ్యతిరేక కూటమికి మద్దతు ఇవ్వలేదని అంటున్నారు. ఒకానొక సందర్భంలో తాము ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభలో కావాల్సినన్ని ఓట్లు వస్తాయో రావో అనే ఆందోళనతో హోంమంత్రి అమిత్ షా కేసీఆర్ కు ఫోన్ చేసి టీఆర్ఎస్ సభ్యులు అందరూ సభకు హాజరయ్యేలా చూడాలని కోరారు. అమిత్‌షా అడిగిందే తడవు హైదరాబాద్‌లో ఉన్న సంతోష్ ను కూడా స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి పంపించారు. ఏడేళ్లుగా ఏ ఒక్క రోజూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు పార్లమెంట్‌లో కానీ ఇటు బయటా కానీ పల్లెత్తు మాట అనలేదని, అడపాదడపా అన్నా అవి ఉత్తుత్తి దూషణలు. విమర్శలు మాత్రమేనని అంటున్నారు. వీళ్ళ మధ్య ఫైట్ టామ్ అండ్ జెర్రీల్లా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో ముస్లిం మైనార్టీ ఓట్ల శాతం గణనీయంగా ఉంటుంది కనుక టామ్ అండ్ జెర్రీ లాగా ఫైట్ చేసుకుంటూ తమ మధ్య నిజంగానే ఘర్షణ ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సెటైర్ వేస్తున్నారు .
అటు ఎంఐఎం కూడా బీజేపీతో రహస్య ప్రేమాయణం సాగిస్తుందని అందరు అనుకుంటున్నారు. దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అక్కడ ఎంఐఎం పోటీచేసి పరోక్షంగా బీజేపీని గెలిపిస్తుంది అని బలంగా ప్రచారం ఉందని చెబుతున్నారు. ఎంఐఎం బలంగా ఓట్లు చీల్చిన చోట్ల బీజేపీ గెలిచింది వాస్తవం అని కూడా అంటున్నారు. ఆ విధంగా బీజేపీ, ఎంఐఎం ,టీఆర్ఎస్‌ల మధ్య రహస్య ప్రేమాయణం సాగుతుందని విశ్లేషణ చేస్తున్నారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడంతోపాటు ఎల్ఐసీ, బ్యాంకులు, టెలికాం, రైల్వేస్‌తోపాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టడంపై గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మోడీ సర్కార్ పై కేసీఆర్ మండిపడ్డారని గుర్తు చేస్తున్నారు. మోడీ సర్కార్‌ను తూర్పార పట్టడమే కాకుండా యుద్ధం ప్రకటించారని.. కానీ కట్ చేస్తే ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్‌షాలను కలిసి వచ్చాక సైలెంట్ అయ్యారని చెప్పుకొస్తున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్‌లో కూడా టీఆర్ఎస్ పాల్గొందని కానీ, ఆ తరువాత యూ టర్న్ తీసుకుందని అంటున్నారు. మోడీ పట్టించుకోనప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్ యుద్ధం ప్రకటిస్తారు.. అపాయింట్మెంట్ దొరకగానే ఢిల్లీ వెళ్లి సెటిల్మెంట్ చేసుకొని వస్తారు అని రాజకీయ ఉద్దండులు అంటున్నారు. ఇలా చాలా సార్లు జరిగింది అని గుర్తు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిత్యం కేసీఆర్‌పై, ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటారు… కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తాం. జైలుకి పంపుతాం అని వార్నింగ్ ఇస్తుంటారు. కానీ కేంద్ర నుంచి వచ్చిన మంత్రులు మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడేసి వెళతారు .. ఇదో విచిత్ర గాధ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వమే కేసీఆర్‌ను తమ దారిలో పెట్టుకోవడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆ మాటలు మాట్లాడిస్తుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. లేక రాష్ట్ర బీజేపీ నాయకత్వం వారి అధినాయకత్వాన్ని అంచనా వేయలేకపోతోందేమో అనే అనుమానం కూడా లేకపోలేదు అని అంటున్నారు.
ఒక వైపు బీజేపీ రాష్ట్ర నాయకులు కేసీఆర్‌పై దాడి పెంచుతుంటే.. మరో వైపు ఢిల్లీ పెద్దలు కేసీఆర్ కు అపాయింట్మెంట్ ఇచ్చి అలయ్, బలయ్ తీసుకుంటున్నారని అంటున్నారు. దీనితో కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తాం.. జైల్లో పెడతాం అని బండి సంజయ్ మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా మారాయని అంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీలు ఒకదానిపై ఒకటి ప్రెజర్ టాక్టిస్‌ను ప్లే చేసుకుంటూ, ఎవరికి వారు తమ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నారేమో అనిపిస్తుందని అంటున్నారు రాజకీయ పండితులు.
మోడీతో కేసీఆర్‌కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని వారు అంటున్నారు. అందుకు కేసీఆర్ 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళితే మోడీ సర్కార్ సంపూర్ణ సహకారాన్ని అందించడమే పెద్ద ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు. మోడీ సర్కార్ అందించిన సహకారానికి ప్రతిఫలంగానే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మమత, దేవెగౌడ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ లతో భేటీ అయ్యారని అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రెంట్ అంటూ కొత్త రాజకీయానికి తెరలేపారని, ఇది మోడీ డైరక్షన్‌లో జరిగిన వ్యవహారమే అని చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్‌కు దగ్గరగా వుండే ప్రాంతీయ పార్టీలను గందరగోళంలోకి నెట్టే లక్ష్యంగా మోడీ గీసిన స్కెచ్ అని అంటున్నారు. ఒక వేళ 2019 లోక్ సభ ఎన్నికలలో హంగ్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా, మోడీ రచించిన వ్యూహానికి కేసీఆర్ సహాయ సహకారాలు అందించారు అని చెబుతున్నారు. కేసీఆర్ తాను ప్రధాని కావాలని కలలు కంటున్నారని అని అందరూ అనుకున్నారు.. అది నిజం కాదు.. మోడీని రెండో సారి ప్రధాని చేయడానికి కేసీఆర్ పరోక్షంగా తన సహాయ, సహకారాలు అందించారని అంటున్నారు. ఎందుకంటే తన ముందస్తు ఎన్నికలకు మోడీ సంపూర్ణ మద్దతు ఇచ్చారు కనుక తాను కూడా మోడీకి సహకరించి కృతజత తెలియచేసుకున్నారని విశ్లేషణ చేస్తున్నారు.
2019 ఎన్నికలలో మోడీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను వదిలేసారని గుర్తు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై నిజంగానే కేసీఆర్ సీరియస్‌గా ఉండి ఉంటే, దానిని కొనసాగించి ఉండేవారని అంటున్నారు. ఇది వారిద్దరి మధ్య జరిగిన రహస్య ఒప్పందం అని చెబుతున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలలో అవినీతి జరిగింది.. త్వరలో కేసీఆర్ అవినీతి బయటకు తీస్తామని రాష్ట్ర బీజేపీ నాయకత్వం తరచూ మాట్లాడుతుంది. కాని అది జరగదు అని అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే మోడీ ఇచ్చిన ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాలో ఆయా ప్రాంతీయ పార్టీలకు ఫండింగ్ చేయమని కూడా కేసీఆర్‌కు చెప్పారని విశ్లేషణ చేస్తున్నారు. అప్పుడే వాళ్లు నీదారిలో ఉంటారని కేసీఆర్ తో చెప్పారని, ఆ మేరకు వారి ఎన్నికల కోసం కేసీఆర్ ఫండింగ్ చేసారని చెబుతున్నారు. మోడీ కనుసన్నలలోనే ఇది జరిగిందని అంటున్నారు. మోడీకి తెలియకుండా కేసీఆర్ ఫండింగ్ చేసారని చాలా మంది అనుకున్నారు కేసీఆర్‌పై మోడీ కోపంగా ఉన్నారు అని కూడా అనుకున్నారు కాని ఇదంతా డ్రామా అని కొట్టిపారేస్తున్నారు మోడీ, కేసీఆర్ కలసి ప్లాన్ చేసిందే ఫెడరల్ ఫ్రంట్ అని చెబుతున్నారు రాజకీయ పండితులు. కేసీఆర్, మోడీ,అమిత్ షా ల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది అని వారు అంటున్నారు. ఇది చాలా అందికి తెలియదు అని అంటున్నారు. నిన్నటి భేటీలో కూడా వీరి మధ్య రహస్య ఒప్పందం జరిగే ఉంటుంది అని చెబుతున్నారు.
మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లితే అందుకు మోడీ సర్కార్ సహకారం ఉండేలా కేసీఆర్ ఇప్పటి నుండే తన ప్రయత్నాలు మొదలు పెట్టారని అంటున్నారు. ఆ మేరకు వారి మధ్య ఏదో ఒక ఒప్పందం జరిగే ఉంటుంది అనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మోడీ , అమిత్ షాలతో కేసీఆర్ భేటీ కావడంతో బీజేపీ, టీఆరెస్ లు ఒకటే అన్న అభిప్రాయం ప్రజలలోకి వెళ్లిపోయింది అని చెబుతున్నారు. బండి సంజయ్ పాదయాత్రకు ఆయన మాటలకు విలువ లేకుండా పోయింది అని అంటున్నారు. ఈటల ఎపిసోడ్ కూడా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిందని అంటున్నారు. హుజురాబాద్ ఎన్నిక వాయిదా వెనుక కూడా కేసీఆర్, మోడీల ఒప్పందం కారణం కావచ్చు అని అంటున్నారు. ఎలక్షన్ దెబ్బకు కేసీఆర్, మోడీ దగ్గర మోకరిల్లాల్సిన పరిస్థితి వచ్చింది అని చెబుతున్నారు. ఈటల తక్షణమే ఎదో ఒక రాజకీయ పార్టీలో చేరేలా వత్తిడి తెచ్చారు. ఆయన బీజేపీలోకి వెళ్లాలనే ఆలోచనతోనే ఆ పని చేసారు అని కూడా అంటున్నారు.ఈటెల కాంగ్రెస్ లోకి వెళ్లడం కేసీఆర్‌కు ఇష్టం లేదని చెబుతున్నారు. ఎందుకంటే బీజేపీ అయితే మోడీతో తనకున్న రిలేషన్స్‌తో ఈటలను కంట్రోల్ చేయవచ్చు.. కాంగ్రెస్ అయితే కష్టం అనే ఆలోచన కేసీఆర్‌కు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.