– పీఎం టార్గెట్ గా ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ..!
– సీఎం టార్గెట్ గా షేమ్ ఆన్ యు కేసీఆర్..!
– సోషల్ మీడియాలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
– అవమానించటంలో కొత్త పద్ధతులు..!
– పీకే మార్క్ ప్లానింగ్ తో కేసీఆర్ అడుగులు
– ఒక్కరోజుకే జ్వరం తగ్గడంపై బీజేపీ అనుమానాలు
– సీఎం యాదాద్రి టూర్ పై విమర్శనాస్త్రాలు
పీకే ఎంట్రీ తర్వాత కేసీఆర్ లో ఎన్నో మార్పులు చూస్తున్నాం.. బీహార్ తరహా భాషను వాడుతూ.. కేంద్రంపై ఏ విషయంలోనూ తగ్గడం లేదు. మూడోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కేసీఆర్ కు బీజేపీ, కాంగ్రెస్ కంట్లో నలకగా మారడంతో బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు స్కోప్ ఇవ్వకుండా చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఆఖరికి మోడీ పర్యటనను కూడా తనకు క్యాష్ చేసుకునేలా పీకే డైరెక్షన్ లో కేసీఆర్ ప్రయత్నించారని చెబుతున్నారు.
స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చారు ప్రధాని. అయితే.. ఆయన ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కింది మొదలు.. తిరుగుపయనం అయ్యేవరకు టీఆర్ఎస్ వర్గం ఒకటే పని పెట్టుకుందని అంటున్నారు విశ్లేషకులు. ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అంటూ కిందిస్థాయి లీడర్ల నుంచి మంత్రుల దాకా హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో మోడీని టార్గెట్ చేశారు. ట్విట్టర్ లో ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ ట్రెండింగ్ లో కూడా నిలిచింది. సుమారు 20 వేలకు పైగా ట్వీట్లు వచ్చాయని సమాచారం. కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు ట్యాంక్ బండ్ పై పెద్ద బ్యానర్ ను కూడా ప్రదర్శించారు.
పీకే ప్లానింగ్ తో జ్వరం అంటూ ప్రధాని టూర్ ను స్కిప్ చేసిన కేసీఆర్.. మోడీని కావాలని అవమానించేలా ప్రవర్తించారని బీజేపీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. నిజానికి పీకే వ్యూహాలు అలాగే ఉంటాయి. ఏపీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ లో ఆచరించింది అదే. ఎదుటి పార్టీ నేతల్ని అవమానించేలా ప్లాన్స్ వేయడం.. ప్రజల్లో వ్యతిరేకతను క్రియేట్ చేయడంలో పీకే దిట్ట అని.. ఆయా రాష్ట్రాల్లో జరిగిన అంశాలే అందుకు నిదర్శనమని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు మోడీ పర్యటన సందర్భంగా జరిగింది కూడా అదేనని అంచనా వేస్తున్నారు.
బీజేపీ ఏమీ తక్కువ తినలేదు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానికి ఎయిర్ పోర్టులో స్వాగతం చెప్పలేదు కేసీఆర్. దీంతో రాష్ట్రానికి ప్రధాని వచ్చినా.. సీఎం రాకపోవడంతో ఏం అంతగా పొడిచే పని ఉందని సీఎంపై విమర్శలు చేశారు. పైగా జ్వరం అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. షేమ్ ఆన్ యు కేసీఆర్ అంటూ ట్విట్టర్ లో రివర్స్ ఎటాక్ చేశారు. ఈ హ్యష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లోకి వెళ్లింది. టీఆర్ఎస్ హ్యాష్ ట్యాగ్ కంటే బీజేపీదే ఎక్కువ ట్రెండ్ అయ్యిందని చెబుతున్నారు విశ్లేషకులు.
మరోవైపు కేసీఆర్ యాదాద్రి టూర్ పైనా బీజేపీ సైడ్ నుంచి ఎటాక్ ఎక్కువగానే జరుగుతోంది. ముగింపు దశలో ఉన్న యాదాద్రి నిర్మాణ పనులను పరిశీలించేందుకు సోమవారం వెళ్తున్నారు కేసీఆర్. ఆలయ పునఃసంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. అరె.. అప్పుడే జ్వరం తగ్గిపోయిందా? మోడీ వెళ్లిపోగానే ఫీవర్ తగ్గిందా..? వెంటనే జిల్లా పర్యటనకు రెడీ అయ్యారు అంటూ సెటైర్లు వేస్తున్నారు బీజేపీ నేతలు.