కరోనా కట్టడి కోసం వినాయక చవితి వేడుకల్ని ఇళ్లలోనే జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ.. వైసీపీ నేతలు మాత్రం గుంపులు గుంపులుగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. వారికి లేని ఆంక్షలు హిందువుల పండుగపైనే ఎందుకు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతిపక్షాలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రెస్ మీట్లు, ధర్నాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం సొంత జిల్లాలో జరిగిన ర్యాలీ, సభకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన ట్వీట్ చేశారు.
విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్
ఇక్కడ చూడండి @ysjagan గారూ! సరిగ్గా గంటక్రితం మీ సొంతజిల్లాలోని ప్రొద్దుటూరులో స్థానిక మీ MLA, MP ల ఆధ్వర్యంలో మీ ప్రియతమ సలహాదారులు @SRKRSajjala గారి సమక్షంలో వేలాదిమందితో ఇలా రోడ్ల మీద ర్యాలీలు చేసుకుంటూ, మీటింగులు పెట్టుకోవచ్చా..? హిందువులు మాత్రం గణేష్ ఉత్సవాలను జరుపుకోవద్దా..? మీరు హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను అణచివేయాలని కంకణం కట్టుకున్నట్టు నిరూపించడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం కావాలా..? దమ్ముంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన, పాల్గొన్న ప్రతీ ఒక్కరిపైనా కేసులు పెట్టి చర్యలు తీసుకోండి.