ఇండియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తినవారి నోళ్లు మూయించివేస్తున్నారని, ఇలాంటి కారణాల వల్లే తాను నాలుగు వేల కి.మీ. కు పైగా భారత్ జోడో యాత్రను చేబట్టానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై తీవ్ర దాడి జరుగుతోందని చెప్పారు. లండన్ లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో ఇంటరాక్ట్ అయిన ఆయన.. మీడియా, జుడీషియరీ, పార్లమెంట్.. ఇలా అన్ని వ్యవస్థలపైనా బీజేపీ దాడికి పాల్పడుతోందని, ప్రశ్నించినవారిని మారు మాట్లాడనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు.
బీబీసీకి ఇప్పుడు ఇలాంటి విషయాలు తెలిసివచ్చాయని, కానీ ఇండియాలో ఈ తరహా పోకడలు నిర్విరామంగా గత తొమ్మిదేళ్లుగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి అనుకూలురైన జర్నలిస్టులను సత్కరిస్తున్నారని, కాని వారిని ఇబ్బందులపాల్జేస్తున్నారని రాహుల్ విమర్శించారు.
వారిని బెదిరిస్తునారని, వారిపై దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. బీబీసీ ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదీ రాయకపోతే చర్యలేవీ ఉండవని, కేసులన్నీ మటుమాయమవుతాయని అన్నారు.
ఇండియాలో మైనారిటీలు వేధింపులకు గురి అవుతున్నారని ఆరోపించిన రాహుల్.. విదేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా ప్రతిష్టను దెబ్బ తీస్తున్నదెవరంటే అది భారత ప్రధాని మాత్రమేనన్నారు. నేను మాత్రం నా దేశ ప్రతిష్టను మంట గలపడం లేదు.. కానీ నేను చెప్పినదాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది అన్నారు. ఇండియాలో విపక్షాలు బలహీనంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని ఆయన తోసిపుచ్చారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని ఎదుర్కొనేందుకు అవి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.