దేశంలో ఆర్థిక వ్యవస్థను మోడీ సర్కార్ నాశనం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ బలోపేతం చేసిందన్నారు. బన్సారా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన సోమవారం పాల్గొన్నారు.
బీజేపీ, ప్రధాని మోడీలు రెండు భారత దేశాలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అందులో ఒకటి ధనవంతులు, వ్యాపారులకు, మరొకటి రైతులు, పేదల కోసం అని ఆయన అన్నారు. దేశాన్ని విభజించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థపై దాడి చేసిందన్నారు. డీమానిటైజేషన్ ను ప్రధాని మోడీ తీసుకు వచ్చారని, జీఎస్టిని తప్పుగా అమలు చేయాలని చూశారని అందుకే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు.
రాజస్థాన్‌లోని శివాలయంలో సోమవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మొదట ఆయన బేనేశ్వర్ దామ్ అనంతరం వాల్మీకి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆయన వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఇతర కాంగ్రెస్ నేతలు ఉన్నారు.