దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత దూకుడు మీదున్న బీజేపీ నేతలు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలపై ఫోకస్ పెడుతున్నారు. కెసిఆర్ సీఎం అయినప్పటికీ రాష్ట్రానికి కేటీఆరే షాడో సీఎం గా వ్యవహరిస్తూ కాంట్రాక్టులు ఇచ్చిన కంపెనీల నుండి కమిషన్లు దండుకొని వేల కోట్లు వెనకేస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంచలన వాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దేశంలోనే అతి పెద్ద కుంభకోణం జరిగిందని, ఈ విషయాలన్నింటిని ఆధారాలతో సహా అతిత్వరలో కేంద్రానికి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కెసిఆర్, కెసిఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై కేంద్రం విచారణ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని, దేశ హోంమంత్రి అమిత్ షా ని కూడా ఇదే విషయమై కలిసి కెసిఆర్ అవినీతి చిట్టా గురించి వివరించి విచారణ చేయాల్సిందిగా కోరతానన్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు దుబ్బాక ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అన్నట్లు మారాయని చెప్పారు. బిజెపి నాయకులను, కార్యకర్తలను కెసిఆర్, కెసిఆర్ అనుచరగణం టార్గెట్ చేసుకొని వేధిస్తోందని, ఇలానే కొనసాగిస్తే కెసిఆర్ కి ఇంకా ఎన్నో ఊహించని దెబ్బలు తగులుతాయన్నారు. దుబ్బాక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతి బిజెపి కార్యకర్త చురుగ్గా అయ్యాడని, త్వరలోనే రాష్ట్రంలో బిజెపి పార్టీ అత్యంత బలమైన శక్తిగా అవతరించబోతుందని, టిఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.