పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలపై ‘నీలినీడలు కమ్ముకుంటున్నాయి’. లండన్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండగా, ఆయన అపాలజీ చెప్పవలసిన అవసరం లేదని, మొదట అదానీ అంశంపై జేపీసీ వేయాలని కోరుతున్నామని కాంగ్రెస్ ఆధ్వర్యాన విపక్షాలు పట్టు పడుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో దీనిపైనే రోజూ రభస జరుగుతూ.. సభలు వాయిదా పడుతున్నాయి.
శుక్రవారం కూడా పార్లమెంట్ ఎలాంటి సభా కార్యకలాపాలూ చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. దేశంలో ప్రజాస్వామ్యం ఉందనుకుంటే సభలో తన వివరణ ఇచ్చేందుకు అనుమతించాలని రాహుల్ గాంధీ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి అభ్యర్థించినా ఆయన ఎలాంటి హామీనివ్వలేదు. రెండో రోజైన నేడు రాహుల్ పార్లమెంట్ కు హాజరయ్యారు.
కానీ నిన్నటి మాదిరే ఈరోజు కూడా సభ ఏ కార్యక్రమాన్నీ చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడింది. తనపై వచ్చిన ఆరోపణలపై పార్లమెంటులోనే మాట్లాడతానని రాహుల్ అంటుండగా.. ఆయన మొదట క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రాహుల్ సభలో కన్నా తొలుత బయట అపాలజీ చెప్పాలని ఈ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా ట్వీట్ చేశారు.
విదేశాల్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. రాహుల్ నిజంగానే సీరియస్ గా ఉన్న పక్షంలో ఆయన తక్షణమే మొదట బయట క్షమాపణ చెప్పాలని, అంతే తప్ప పార్లమెంట్ స్థాయిని దిగజార్చరాదని అన్నారు. సోమవారం సభ సమావేశమైనప్పుడు కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది.