సావర్కర్ పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. ముంబైలో వారు నిరసన ప్రదర్శనకు దిగి ఆయన పోస్టర్లపై బూట్లు విసిరారు. నల్లరంగు పూశారు. భారత స్వాతంత్య్ర సమరంలో వినాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటిష్ వారికి సాయపడ్డారని, వారి నుంచి స్టయిపెండ్ తీసుకున్నారని రాహుల్ గాంధీ నిన్న ఆరోపించారు. పైగా బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ అప్పుడు ఏమయ్యాయని, ఆనాడు వాటి ఉనికే లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో సేవలందించారని చెప్పారు.
ముఖ్యంగా సావర్కర్ పై ఆయన కామెంట్స్ అనుచితంగా ఉన్నాయని బీజేపీ నేత రామ్ కదమ్ ఆరోపించారు. ‘జూటా మారో ఆందోళన్’ పేరిట ఆయన ఆదివారం నిర్వహించిన ప్రొటెస్ట్ లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సావర్కర్ ని రాహుల్ అవమానించారని, ఆయన క్షమాపణ చెప్పాలని రామ్ కదమ్ డిమాండ్ చేశారు.
ఎప్పుడూ రాహుల్ ఇలా అవమానకర వ్యాఖ్యలు చేస్తుంటారని, వీటిని ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు. ఒక దశలో పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి రాహుల్ పోస్టర్లపై బూట్లు విసిరి, నల్లరంగు పూశారు.
రాహుల్ ఇలా మాట్లాడినా మాజీ సీఎం ఉధ్ధవ్ థాక్రే స్పందించడం లేదని, రాహుల్ ని ఎందుకు ప్రశ్నించడం లేదని రామ్ కదమ్ అన్నారు. హిందుత్వను ఆయన వదిలేశారా అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వీర్ సావర్కర్ ని అవమానపరచిన అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పోస్టర్ ని నాడు శివసేన నేత బాలాసాహెబ్ థాక్రే చెప్పుతో కొడుతున్న భారీ పోస్టర్ ని బీజేపీ కార్యకర్తలు ప్రదర్శించారు. అలాగే మౌనంగా ఎందుకు ఉంటున్నారని ఉద్ధవ్ ని ఉద్దేశించి స్లోగన్స్ రాసిన పోస్టర్లను కూడా వారు చేత పట్టారు.