వివాదస్పద పౌరసత్వ చట్టానికి అనుకూలంగా బీజేపీ కోల్ కతా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన కొన్ని గంటల్లోనే ఆ పార్టీ నేత ఒకరు పౌరసత్వ చట్టంపై ప్రశ్నలు సంధించారు. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ బంధువు, పశ్చిమ బెంగాల్ బీజేపీ అగ్రనేత చంద్రకుమార్ బోస్ సోషల్ మీడియాలో స్పందించారు. భారత దేశంలో అన్ని మతాలు, కులాలకు సంబంధించిన వారు నివసించవచ్చు… దీన్ని ఏ ఇతర దేశంతో సమానంగా చూడడం..పోల్చడం తగదన్నారు. ఒక వేళ పౌరసత్వ చట్టం 2019 ఏ మతానికి సంబంధించినది కాకపోతే హిందూ, సిక్కు, బౌద్ద, క్రిస్టియన్, పార్శీ, జైన్ అని మాత్రమే ఎందుకు పెట్టారని చంద్రకుమార్ బోస్ ప్రశ్నించారు. వారితో పాటు ముస్లిం పదాన్ని ఎందుకు కలపలేకపోయారన్నారు. మనం పారదర్శకంగా ఉండాలని సూచించారు.
ముస్లింలకు తాము వ్యతిరేకం కాదంటూ చట్టాన్ని సమర్ధిస్తూ బీజేపీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తూ ముస్లింలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అదే పార్టీకి చెందిన ఓ రాష్ట్ర నేత ప్రశ్నలు సంధించడం సంచనలనంగా మారింది.