- సరికొత్త ప్లాన్ తో టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం..!
- కల్వకుంట్ల ఫ్యామిలీ టార్గెట్ గా బీజేపీ రాజకీయాలు..!
- కదన రంగంలోకి ఉద్దండ నాయకులు..!
- టీఆర్ఎస్ ను ఢీకొట్టే ఆ నలుగురు నేతలు ఎవరు..?
కొత్త అస్త్రాలతో కమలం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. బెంగాల్ ఫార్ములా తెలంగాణలో వర్కవుట్ చేసేలా ముందుకెళ్తోంది. అధికార పార్టీ ముఖ్యనేతలను మానసికంగా దెబ్బతీయాలని భావిస్తోంది. టీఆర్ఎస్ బలాన్ని.. బలహీనపర్చడానికి కమలనాథులు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు నలుగురు కీలక నేతలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి కొత్త అస్త్రాల కోసం వేట మొదలు పెట్టిందని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేసే యోచనలో ఉందట బీజేపీ జాతీయ నాయకత్వం. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు రచిస్తున్నారట. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయటంతో పాటు.. అధికార పార్టీ కీలక నేతలను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు ప్రారభించారట. తమ ప్రణాళికలో భాగంగా టీఆర్ఎస్ అధినాయకత్వాన్నే కమలనాథులు.
టీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉన్న కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే తమ పని సులువవుతుందని బిజెపి అధిష్టానం భావిస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆరే సుప్రీం. పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడిపిస్తూ తనను ఎవరు క్రాస్ కాకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్తున్నారు. కేసీఆర్ ను టార్గెట్ చేయటంలో భాగంగానే సీనియర్ నేత ఈటల రాజేందర్ ను గజ్వేల్ నుండి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కేసీఆర్ పై పోటీకి ఈటల సై అంటున్నారు. తనకు గజ్వేల్ నియోజకవర్గం గ్రామాలతో మొదటి నుండి మంచి అనుబంధం ఉందని.. అక్కడ నుండి పోటీ చేసి కేసీఆర్ ను ఓడించి తీరుతానంటూ శపథం కూడా చేశారు ఈటల.
మరోవైపు టీఆర్ఎస్ లో నంబర్ టూ గా కేటీఆర్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ తన గుప్పిట్లో పెట్టుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దీంతో కేటీఆర్ ను కట్టడి చేసేందుకు బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ను రంగంలోకి దింపిందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సిరిసిల్ల నుండి కేటీఆర్ ప్రాథినిత్యం వహిస్తున్నారు. సిరిసిల్ల కరీంనగర్ లోక్‌సభ పరిధిలో ఉంది. దీంతో కేటీఆర్ పై బండి సంజయ్ ను బరిలోకి దిగితే కేటీఆర్ ను చక్రబంధంలో ఉంచవచ్చని బిజెపి అధిష్టానం భావిస్తోంది. తద్వారా కేటీఆర్ ను ఎన్నికల సమయంలో నియోజకవర్గానికే పరిమితం చేయచ్చని కమలనాథుల వ్యూహం. బండి సంజయ్ ని పోటీ చేయిస్తే కేటీఆర్ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపించవచ్చనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు టీఆర్ఎస్ లో మరో కీలకనేత.. మంత్రి హరీష్ రావు.. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయనకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో ఉప ఎన్నికలు జరిగిన నారాయణ ఖేడ్, వరంగల్ లోక్ సభ స్థానాలతో పాటు సాధారణ ఎన్నికల్లో మెదక్, దుబ్బాక, సీఎం కేసీఆర్ నియోజక వర్గం గజ్వెల్, గద్వాల్, కొడంగల్ లతో పాటు ఆయనకు అప్పగించిన నియోజకవర్గాల్లో పార్టీని గెలిపిండంలో హరీష్ పాత్ర కీలకం. అయితే దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమితో హరీష్ రావు ఇమేజ్ కొంత తగ్గింది. అన్నీ తానై ప్రచారం చేసినా ప్రజలు టీఆర్ఎస్ ను కాదని బీజేపీని గెలిపించారు. దీంతో ఆయనపై మరింత ఒత్తడి పెంచే యోచనలో ఉన్నారట బీజేపీ జాతీయ నాయకులు. దుబ్బాక నుంచి గెలిచి హరీష్ రావుకు రఘనందనరావు సవాల్ గా మారారు. దీంతో సిద్దిపేట నుంచి హరీష్ రావుపై రఘనందనరావును పోటీకి దింపితే ఎలా ఉంటోందని కమలం పార్టీ నాయకత్వం భావిస్తోందట.
కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను కూడా సొంత నియోజకవర్గానికి పరిమితం చేయాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. 2014లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీచేసి గెలిచిన కవిత… గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి కూతురును ఓడించిన ధర్మపురి అర్వింద్ 2019లోకసభ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. అయితే ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని కవిత భావిస్తున్నారట. ఇందులో భాగంగా అసెంబ్లీకి కవిత పోటీ చేసే స్థానం నుంచి బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ పోటీకి సై అంటున్నారట. బీజేపీ జాతీయ నాయకత్వం సైతం ఎంపీ అర్వింద్ కు అండగా నిలుస్తోందన్న చర్చ కాషాయ పార్టీలో నడుస్తోంది.
మొత్తానికి మమతా బెనర్జీపై అమలు చేసిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేయాలని కమలనాథులు భావిస్తున్నారట. మరి తెలంగాణలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.