కేసీఆర్ పుట్టిన రోజున సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వేడుకలు చేస్తుంటే.. మేడ్చల్ లో బీజేపీ శ్రేణులు మాత్రం వినూత్నంగా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. గతేడాది సరిగ్గా ఇదే రోజున మేడ్చల్ కండ్లకోయలో ఐటీ పార్కు కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకానికి పాలాభిషేకం చేసేందుకు ప్రయత్నించారు.
ఇక గతేడాది కేసీఆర్ పుట్టిన రోజున మేడ్చల్ కండ్లకోయలో ఐటీ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి మాత్రం చేపట్టలేదు. దీంతో గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ నుంచి 10 లక్షల నిధులు తీసుకొని రంగులు వేసి ఐటీ హబ్ ప్రారంభించబోతున్నామని ఆర్భాటాలు చేశారని బీజేపీ నేతలు మండిపడ్డారు.
సంవత్సరం గడిచినా.. ఇంతవరకు తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఆ శిలాఫలకానికే పాలాభిషేకం చేసి అక్కడ కేక్ కట్ చేసి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకొని స్టేషన్ కు తరలించారు. దీంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ఇక మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలోని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా జోకర్ లాగా ప్రసంగం చేస్తుంటే.. వారి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే నవ్వుతున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు.