- సెటిటర్ల ఓట్లు ఎటువైపు..?
- ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా బరిలోకి కీలక నేత..!
- ఓట్ల బదలాయింపుపై బిజెపి దృష్టి
- ఆకర్ష్ సీమాంధ్ర ఓటర్లు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఆయా వర్గాల ఓటర్లను కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగానే బీజేపీ హైదరాబాద్ టార్గెట్ గా ఎలక్షన్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికీ సెటిలర్లు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నందున.. ఆంధ్ర సెటిలర్లపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ చేసింది. గ్రేటర్ పరిధిలోని సెటిలర్లను తమవైపు తిప్పుకోవటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూనే.. సెటిలర్ల సమన్వయ బాధ్యతను ఓ సీనియర్ నేతకు అప్పగించనున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాలలో సెటిటర్లు కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. ఇలా కనీసంగా ఇరవై అసెంబ్లీ స్థానాలలో సెటిలర్ల ఓట్లు ప్రముఖంగా ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాల్లో సీమాంధ్ర నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకొన్న వారు అధికంగా ఉన్నారు. ఇలా వీరంతా 20 అసెంబ్లీ, రెండు నుంచి ఐదు లోక్‌సభ స్థానాలలో పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉండటంతో అన్ని రాజకీయ పార్టీల కన్ను ఈ ఓటర్లపైనే పడింది. సెటిలర్లను ఆకట్టుకునేలా బీజేపీ టాస్క్ రూపొందించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
తెలంగాణ ప్రజలతో పాటు తెలంగాణేతురలను సైతం తమవైపు తిప్పుకుంటేనే అధికారంలోకి రాగలుగుతామని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. నిజానికి హైదరాబాద్ ను మినీ భారత్ గా మారింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరంలో నివసిస్తున్నారు. వేల కిలోమీటర్ల నుంచి వలస వచ్చి హైదరాబాద్ లో సెటిలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే సెటిలర్స్ ను అస్త్రాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జీహెచ్ఎంసీ పరిధిలోని మెజారిటీ నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ఓటర్ల శాతం అధికంగా ఉండటమే బీజేపీ తాజా ప్రణాళికలకు కారణంగా తెలుస్తోంది.
2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రప్రాంత సెటిలర్లు టీఆర్ఎస్ కు జై కొట్టినా.. బీజేపీకి అనుకూలంగా నార్త్ ఇండియా సెటిలర్లు నిలిచారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో 48స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఇదే విధానాన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి అనుకూలంగా ఆంధ్ర ప్రాంత సెటిలర్లు ఓటు వేశారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంత వాసులు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉన్న కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ పరిధిలోని మెజారిటీ డివిజన్లను గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకుంది. ఈనేపథ్యంలో రానున్న ఎన్నికల్లో సైతం కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఆంధ్రప్రాంత సెటిలర్లు ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. వీరితో పాటు ఉత్తరాది ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా తెలంగాణలో చాలా మంది స్థిరపడ్డారు. సహజంగానే వారి మద్దతు తమకే ఉంటోందని కమలం పార్టీ నాయకత్వం లెక్కలు వేసుకుంటోందట. ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సెటిలర్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు ఏపీ సెటిలర్లపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. తెలంగాణలోని సెటిలర్లు ప్రస్తుతం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారని వివిధ సర్వే సంస్థలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత పాత టీడీపీ క్యాడర్ తో పాటు.. ఓటర్లు కాంగ్రెస్ వైపు మెగ్గుచూపుతున్నారు. దీంతో ఏపీ సెటిలర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. సీనియర్ నేత, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహనరావుకు సెటిలర్లను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల సమాచారం.
గతంలో తెలుగుదేశంలో కీలక నేతగా చలామణి అయిన గరికపాటి మోహనరావుకు ఆంధ్ర ప్రాంత సెటిలర్లతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయట. దీంతో గరికపాటి సేవలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఏపీలో జరిగే ఎన్నికలు కూడా తెలంగాణపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుల మీద తెలంగాణ రాజకీయాలు ఆధారపడి ఉండే అవకాశాలున్నాయి. వైసీపీ, టీఆర్ఎస్ కు మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. దీనిలో భాగంగానే ఆంధ్ర సెటిలర్ల ఓట్లు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పడటంలో వైసీపీ పాత్ర ఉందని బీజేపీ నాయకత్వం అంటోందట.
అయితే తాజాగా పోలవరం ఎత్తు తగ్గించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. దీనికి తోడు నదీ జలాల విషయంలోనూ అగ్గి రాజేసే ప్రయత్నాలు టీఆర్ఎస్ సర్కార్ చేస్తోందని బీజేపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలతో పాటు.. కేంద్రానికి అన్ని బిల్లుల విషయంలో వైసీపీ పూర్తి మద్దతుగా ఉంటోంది. ఈనేపథ్యంలో తెలంగాణలోని వైసీపీ సానుభూతి, జగన్ అభిమానుల ఓట్లను సైతం కొల్లగొట్టాలని తెలంగాణ బీజేపీ నాయకత్వం భావిస్తోందట. మొత్తానికి సెటిలర్ల ఓట్లను కమలనాథులు ఎంతవరకు తమకు అనుకూలంగా మలుచుకుంటారో వేచి చూడాలి.