– కమలం పార్టీకి షాకిస్తున్న సర్వేలు
– లోక్ సభ సీట్లపై భయాలు
– పరేషాన్ చేస్తున్న ఆపరేషన్ సౌత్!
– కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే కీలకం
– కేరళలో మారని పరిస్థితి
– తమిళనాడు, ఏపీల్లోనూ అదే సీన్
– ఆశల తెలంగాణలో సత్తా చాటడం కష్టమేనా?
ఓవైపు భారత్ జోడోతో కాంగ్రెస్ ఊపుమీదుంది. దీనికి కొనసాగింపుగా హాత్ సే హాత్ యాత్రకు శ్రీకారం చుట్టింది. రెండు పర్యాయాలు మోడీ సర్కార్ ను చూసిన ప్రజలు ఈసారి పక్కాగా కాంగ్రెస్ కు అవకాశం ఇస్తారని ఆపార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ చర్యలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ మోడీని ఇరకాటంలోకి నెట్టాలని చూస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉంటుందని భావించిన బీజేపీ ముందే తన వ్యూహాల్లో ఉందనేది రాజకీయ పండితుల వాదన. సర్వేల్లో ఈసారి భారీగా పార్లమెంట్ స్థానాలు తగ్గే అవకాశం ఉందని తేలడంతోనే ఈ ముందస్తు చర్యలకు పూనుకుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సౌత్ ను చేపట్టి.. దానికి తగ్గ ప్రణాళికల్లో ఉందని వివరిస్తున్నారు. కానీ, ఇది వర్కవుట్ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఎదురవుతోంది.
నార్త్, ఈశాన్యంలో లోక్ సభ స్థానాలు తగ్గుతాయని భావించిన బీజేపీ అధిష్టానం సౌత్ స్టేట్స్ పై ఫోకస్ పెంచింది. అయితే.. ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మిగిలిన చోట్ల అంతగా ప్రభావం చూపలేకపోతోందనేది విశ్లేషకుల మాట. కర్ణాటకలోనూ అంత ఈజీగా సీట్లు దక్కే అవకాశాలు లేవని అంటున్నారు. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా బీజేపీ అధికారం చేపడితేనే లోక్ సభ ఎన్నికల్లో ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. లేదంటే కష్టమే. పక్కాగా అధికారం తమదేనని కాంగ్రెస్ చెబుతుంటే.. కుమారస్వామి పార్టీ బీఆర్ఎస్ అండదండలతో దూకుడుగా కనిపిస్తోంది.
ఇక తమిళనాడులో అన్నాడీఎంలో నెలకొన్న గందరగోళాన్ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అన్నామలై నేతృత్వంలో ఫుల్ స్పీడ్ మీదుంది. కానీ, తమిళనాడు రాష్ట్రం దక్షిణాది ప్రాంతంలో పూర్తి విభిన్నమైంది. అక్కడ పెరియార్ ప్రభావం ఎక్కువ. తమిళ భావోద్వేగాలు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, ఇప్పుడు స్టాలిన్ ఇలా అందరూ సెంటిమెంట్ రాజకీయాలను రగిలిస్తూనే ముందుకు సాగారు. అందువల్లే జాతీయ పార్టీలను తమిళనాడు ప్రజలు అంత ఈజీగా తమ ప్రాంతంలోకి రానివ్వరని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అయితే.. అన్నామలై రాక తర్వాత బీజేపీలో మార్పులు వచ్చిన మాట వాస్తవమే. కానీ, ఇది ఓట్ల రూపంలోకి మారుతుందా? తమిళ ప్రజలు నమ్ముతారా? అనేది చెప్పలేమంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ సీట్లు తెలంగాణలో వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలు దక్కించుకుంది. ఇదే ఊపులో తెలంగాణలో అధికారం సాధిస్తామని చెబుతూ వస్తోంది. రెండు ఉప ఎన్నికలు దక్కించుకున్నా.. అభ్యర్థుల గుడ్ విల్ వల్లే గెలుపు సాధ్యమైందనే వాదన ఉంది. నిజంగా బీజేపీ పుంజుకుంటే మునుగోడు ఉప ఎన్నికలో ఎందుకు గెలవలేదనే చర్చ ఉంది. ఓట్ల శాతం పెరిగిందని కవర్ చేసే ప్రయత్నం చేసినా.. అన్ని నియోజకవర్గాల్లో రాజగోపాల్ రెడ్డి స్థాయిలో ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? అనే ప్రశ్న వేస్తే మాత్రం కమలనాథుల్లో టెన్షన్ మొదలవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు.
ఏపీలో పరిస్థితి సరేసరి. అసలు.. లోక్ సభ సీట్ల సంగతి దేవుడెరుగు.. అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ డిపాజిట్ దక్కించుకుంటుందా? అనే స్థాయిలో ఉందని వివరిస్తున్నారు. తమిళనాడు మాదిరే ఏపీలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంటుంది. ఇప్పుడు అక్కడ టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య పోటీ నెలకొంది. జనసేనతో పొత్తులో ఉన్నామని బీజేపీ చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ సైలెంట్ రాజకీయం వారికి అంతుబట్టడం లేదు. అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ సమావేశాలు అవుతుండడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికితోడు పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పేశారు. ఏపీలో బలమైన కాపు నేతల్లో ఈయన కూడా ఒకరు. సోము వీర్రాజు అదే సామాజికవర్గమే అయినా.. జనసేన, వైసీపీని కాదని కాపులు బీజేపీ వైపు నిలబడతారా? అనేది కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు. రంగా పేరుతో కొన్నాళ్లుగా జీవీఎల్ హడావుడి చేస్తున్నా.. అదంతా కన్నా రూపంలో జరిగే డ్యామేజ్ ను కవర్ చేసుకునేందుకే అనే వాదన ఉంది.
ఇక కేరళలో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అక్కడ ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం సాగిస్తోంది. కానీ, లెఫ్ట్ పార్టీలు కట్టడి చేస్తూనే ఉన్నాయి. అటు కాంగ్రెస్ కూడా బీజేపీని ఆ రాష్ట్రంలో ఎదగనీయకుండా చేస్తోంది. ఇలా ఆపరేషన్ సౌత్ మొదలు పెట్టిన బీజేపీ ముందు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించి పార్లమెంట్ ఎన్నికల నాటికి సీట్లు పెంచుకోవడం కష్టమేనని అంటున్నారు రాజకీయ పండితులు.