రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగాన్ని వ్యతిరేకించిన బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ను అవమానిస్తే.. రాజ్యాంగ సంస్థలను, రాజ్యంగ పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని బీజేపీ నాయకులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిప్డడారు.
సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగాన్ని ఎందుకు వ్యతరేకిస్తున్నారో స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ తో అబద్దాలు మాట్లాడించామంటున్న బీజేపీ నేతలు ఇన్ని రోజులు వారు అబద్దాలు మాట్లాడించారని తాము భావించాలా అని ప్రశ్నించారు మంత్రి జగదీశ్ రెడ్డి.
అసెంబ్లీలో అబద్దాలు చెప్పారన్న బీజేపీకి గవర్నరే సమాధానం చెప్తారని వెల్లడించారు. బీజేపీకి రాజకీయాలు, ఓట్లే తప్ప సంస్థలు, వ్యక్తులు, ప్రజల పట్ల గౌరవం లేదని స్పష్టం అవుతోందని ఆరోపించారు. ఇక ఇలా ఉంటే.. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అంశాలు ప్రస్తావించలేదని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ అంశాలు పేర్కొనలేదా? లేక గవర్నర్ తొలగించారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో హామీలు ఇస్తారు.. కానీ అవి బయట మాత్రం అమలు చేయరని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.