బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు రాత్రి (సోమవారం) 7 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిసింది. 15 నెలలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ ప్రకారం కమల్ నాథ్ గత గురువారం అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉండగా డెడ్ లైన్ కు ముందే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో మెజార్టీ సభ్యులున్న బీజేపీ అధికారం చేపట్టబోతుంది. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన శివరాజ్ సింగ్ నాలుగో సారి ముఖ్యమంత్రి పదవిని అలంకరించబోతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 22 మంది ఆయన అనుచర ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వారంతా బీజేపీలో చేరారు.