ఓవైపు వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు టీఆర్ఎస్ నేతలు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీస్తున్నారు. ఏ మంత్రి కాన్వాయ్ కనిపించినా అడ్డుకుంటున్నారు. రాష్ట్రమంతా రైతులనుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇటు నిరుద్యోగులు సైతం రగిలిపోతున్నారు. ఎన్నేళ్లయినా నోటిఫికేషన్ల జాడ లేకపోవడంతో మండిపడుతున్నారు. నోటిఫికేషన్ల అంశంపై మొదట్నుంచి బీజేవైఎం ఆందోళనలు కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ నేతలు ఏ టూర్ కి వెళ్లినా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ కాన్వాయ్ ని అడ్డుకునేందుకు చూశారు బీజేవైఎం కార్యకర్తలు.
జోగులాంబ జిల్లా గద్వాల పర్యటనకు వెళ్లారు సీఎం కేసీఆర్. అయితే జడ్చర్ల దగ్గర సీఎం కాన్వాయ్ పైకి బీజేవైఎం కార్యకర్తలు దూసుకెళ్లారు. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నిరసన తెలిపిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.