ఎన్నికలప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అన్న కేసీఆర్.. ప్రజలకు ఇచ్చింది కన్నీళ్లు, అప్పులు, నిరుద్యోగ ఆత్మహత్యలని విమర్శించారు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డికి చేరిన సందర్భంగా జరిగిన బహిరంగసభకు ఆయన హాజరయ్యారు. భారత్ మాతాకీ జై.. జై శ్రీరాం.. ప్రజా సంగ్రామ యాత్ర సారథి, హిందూ టైగర్ బండి సంజయ్ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన తేజస్వి.. టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణలో నయా నిజాం, గడీల పాలనను చూస్తున్నామన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ కార్యకర్తల గుండెల్లో ప్రజా సంగ్రామ యాత్రను చూసి భయం పట్టుకుందని విమర్శించారు. బీజేపీ చేస్తున్న ధర్మ యుద్ధంలో ప్రతీ ఒక్కరం విజయం సాధించి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదన్న తేజస్వి.. కేసీఆర్ అన్నీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ లేదు.. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తానని ఇవ్వలేదు.. డబుల్ బెడ్రూం ఇళ్లు అని ఇవ్వలేదు.. కేసీఆర్ ఝూటా సర్కార్.. పచ్చి అబద్దాల ప్రభుత్వమంటూ విమర్శించారు. అలాంటి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించడమే యువ మోర్చా లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు.
యువ మోర్చా కార్యకర్తలంటేనే టీఆర్ఎస్ భయపడుతోందన్నారు తేజస్వి. రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ పై తప్పుడు కేసులు పెట్టారని.. టీఆర్ఎస్ గూండాలు పెట్టే కేసులకు యువ మోర్చా భయపడదని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ సర్కార్ దేశద్రోహ పార్టీ ఎంఐఎంకు మద్దతిస్తోందని.. కారు టీఆర్ఎస్ దే… స్టీరింగ్ డ్రైవర్ మాత్రం రజాకార్ నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఈ రజకార్ రాజ్యాన్ని కూకుటివేళ్లతో కూల్చేందుకే బండి పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. కేసీఆర్ పై దండయాత్ర అని అన్నారు.
దేశం మొత్తం ప్రధాని మోడీ వైపు చూస్తోందన్నారు తేజస్వి. దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్న ఆయన… ఆ బాధ్యత యువ మోర్చా కార్యకర్తలు, ప్రజలపై ఉందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అవినీతి, నియంత కుటుంబ పాలనకు అడ్డుకట్ట వేయాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కేసీఆర్ 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను వదిలి… కుటుంబంలోని నలుగురికే పెద్దపీట వేస్తున్నారని సెటైర్లు వేశారు.
బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని… ఇంటింటికీ మోడీ పథకాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు తేజస్వి. టీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని.. 2023 ఎన్నికలయ్యే దాకా యువ మోర్చా కార్యకర్తలు, ప్రజలు విరామం తీసుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని చెప్పారు.