తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం రణరంగాన్ని తలపించింది. నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తిన BJYM… TSPSC ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కార్యకర్తలు నిరసనకు దిగారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుదోగ్య యువత అన్యాయానికి గురవుతోందని BJYM రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ మండిపడ్డారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
2018 ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని వెంటనే చెల్లించాలన్నారు భానుప్రకాష్. లేకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా యువతను ఏకం చేసి కచరా ప్రభుత్వాన్ని కనుమరుగు చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీ కోసం కమిటీ వేసిన ప్రభుత్వం.. నోటిఫికేషన్లు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు భానుప్రకాష్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ వింగ్ కన్వీనర్ సందీప్ ముట్టగి, రాష్ట్ర పదాధికారులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఇటు పలు జిల్లాల్లో కూడా BJYM ఆందోళనలు కొనసాగాయి. ఉద్యోగాల భర్తీతో పాటు నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు చేశారు కార్యకర్తలు. కొన్నిచోట్ల లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని పలువుర్ని అరెస్ట్ చేశారు.