ఎస్సై,కానిస్టేబుల్ నియామకాల విషయంలో అభ్యర్థులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి నిరుద్యోగులతో ఆటలాడుకున్నారని ప్రతిపక్షాలు కూడా వీరికి అండగా నిలబడ్డాయి. వారితో కలిసి పార్టీల అనుబంధ సంస్థలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేవైఎం నేతలు యత్నించారు.
డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు నేతలు. ఒకేసారి కార్యాలయంలోకి రావడంతో భద్రతా సిబ్బంది సైతం చేతులెత్తేసింది. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆందోళన చేస్తున్న బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ డిమాండ్ చేశారు. ఎస్సై పరీక్షలో 9 మార్కులు, కానిస్టేబుల్ పరీక్షలో 7 మార్కులను కలపాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని.. కానీ, దీన్ని అమలుపరచడం లేదని మండిపడ్డారు. ఇది అమలు చేస్తే.. దాదాపు రెండు లక్షల మంది వరకు ఈవెంట్స్ కు ఎలిజిబుల్ అవుతారని తెలిపారు.
మార్కులు కలిపితే మరోసారి ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. లాంగ్ జంప్ 4 మీటర్ల నుండి 3.8 మీటర్లకు తగ్గించాలని, 1500 మీటర్లు ఉన్న పరుగు పందాన్ని 800 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో భానుప్రకాష్ కు గాయాలయ్యాయి. పోలీసులు పలువురు బీజేవైఎం నేతలను స్టేషన్ కు తరలించారు.