గులాబీ నేతలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా నిరసన సెగ తప్పడం లేదు. ఏదో ఒక సమస్యతో అటు ప్రజలు, ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు నిలదీయడమో.. కాన్వాయ్ ని అడ్డుకోవడమో చేస్తున్నారు. మహబూబ్ నగర్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ కు కూడా ఇది తప్పలేదు.
మహబూబ్‌నగర్ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభించడానికి కేసీఆర్ వెళ్లారు. అయితే.. జడ్చర్ల పట్టణ పరిధిలోని కావేరమ్మపేట దగ్గర బీజేవైఎం కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకొని సీఎం డౌన్ డౌన్ అంటూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని.. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
నిరసన తెలుపుతున్న బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకొని జడ్చర్ల పోలీస్ స్టేషన్ తరలించారు. శనివారం కామారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. నిరుద్యోగ భృతి చెల్లించాలంటూ బీజేపీ యువ మోర్చా నాయకులు పిట్లం మండలంలో 30 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ఆయన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. హరీష్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. కాన్వాయ్ ఎదుట ఆందోళనకు దిగారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఇదే అనుభవం ఎదురైంది. మంజూరు నగర్ వద్ద మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారు ఎన్ఎస్యూఐ నాయకులు. విద్యాశాఖలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ లకు సొంత భవనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.