మహారాష్ట్రలో బీజేపీకి చెందిన ఫడణవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తప్పుబట్టారు. ఎవరూ ఊహించని రీతిలో తెల్లవారు జామున రహస్యంగా గవర్నర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి రాజకీయంగా, న్యాయపరంగా తమకు సవాల్ విసిరారని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే గవర్నర్ పాత్రపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. మొదట బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్, ఆ తర్వాత శివసేన, ఎన్సీపీలను పిలిచారని…కాంగ్రెస్ కు ఆ అవకాశమే ఇవ్వలేదని చెప్పారు. ఓ వైపు శివసేన-ఎన్సీపీ ప్రభుత్వ ఏర్పాటుపై మీడియాతో మాట్లాడిన కొద్ది సేపటికే మద్దతుదారుల జాబితాను కూడా సరి చూసుకోకుండా గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారని అన్నారు. ఎక్కడో ఏదో జరిగిందని చెప్పారు. తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేయించి గవర్నర్ ప్రజాస్వామిక విలువలను దిగజార్చారన్నారు.