ఎన్టీఆర్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. తిరువూరు మండలం పరిధిలోని చౌటపల్లి గ్రామంలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. టేకులపల్లి-చౌటపల్లి గ్రామాల సరిహద్దులో లంకెబిందెలు ఉన్నాయని.. క్షుద్రపూజలు చేసేందుకు 8 మంది నిందితులు వచ్చారు. వారి వెంట ఒక పూజారితో కూడా ఓ చిన్న బాలుడు కూడా ఉన్నాడు. వీరంతా అర్థరాత్రి గ్రామంలో తిరుగుతుండగా గ్రామస్తులకు కనిపించారు.
బాలుడ్ని చూసి.. గ్రామస్తులకు అనుమానం వచ్చింది. దీంతో గ్రామస్తులందరూ వారి వద్దకు వెళ్లి నిలదీశారు. బాలుడితో ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పారు. ఈ క్రమంలో గ్రామస్తులు నిందితులకు దేహశుద్ధి చేశారు. వీరిలో నలుగురు నిందితులు తప్పించుకుని పారిపోయారు. అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులంతా బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులని తేలింది. గ్రామంలో గుప్తనిధులు ఉన్నాయనే సమాచారంతో ఆ నిందితులు పూజలు చేయడానికి వచ్చారని అనుమానిస్తున్నారు పోలీసులు.
బాలుడిని నరబలి ఇవ్వడానికి తీసుకొచ్చారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.