బాంబు దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ దద్దరిల్లిపోయింది. నగరంలో సోమవారం ఉదయం తెల్లవారు జామున రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న కీవ్ నగరం రష్యా బాంబు దాడులతో మరోసారి ఉలిక్కి పడింది.
కీవ్ తో పాటు ఎల్వివ్, జైటోమిర్, ఖ్మెల్నిట్స్కీ, డ్నిప్రో, టెర్నోపిల్ నగరాల్లోనూ బాంబు పేలుళ్లు సంభవించాయి. శక్తివంతమైన పేలుళ్ల కారణంగా కీవ్ లో విద్యుత్ కు అంతరాయం కలిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు షెవ్చెంకో జిల్లాలోనూ ఈ పేలుళ్లు సంభవించాయని కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కో వెల్లడించారు.
బాంబు పేలుళ్ల కారణంగా ప్రాణనష్టం జరిగిందని అధికారులు తెలిపారు. సుమారు 8 మంది మృతి చెందగా, 24 మందికి గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. బాంబు దాడులతో కీవ్ లోని పలు ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. అయితే నిన్న క్రిమియా బ్రిడ్డి కూల్చివేతకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయంపై కూడా మిస్సైల్ దాడి జరిగింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఉక్రెయిన్ ను ఈ భూమిపై కనిపించకుండా చేయాలని రష్యా చూస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. పలు నగరాలపై మిస్సైల్ దాడులు జరగ్గా చాలా మంది గాయపడ్డట్టు తెలిపారు.