జమ్ముకాశ్మీర్ లో రంగురంగుల విరులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ ను పుష్పవర్థన విభాగం అధికారులు తెరిచారు. ఏటా పుష్పాలు వికసించే సీజన్ లో పర్యాటకుల సందర్శనార్థం ఈ గార్డెన్ ను తెరుస్తుంటారు.
ఈ పూదోటలో ఐదు రంగుల్లో తులిప్ పుష్పాలు దర్శనమిస్తాయి. తులిప్ పూలతో పాటే చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్ గార్డెన్ కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్ లున్నాయి. అయితే శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతి పెద్దది.
ప్రతి ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసిస్తుంటే ఈ గార్డెన్ ను తెరుస్తారు. అదే విధంగా ప్రతి ఏడాది తులిప్ ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు తులిప్ ఫెస్టివల్ జరగనుంది. అంటే ఈ 20 రోజుల పాటు రంగురంగుల తులిప్ పుష్పాలు, రకరకాల ఇతర పుష్పాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి.