న్యాయవాది వామనరావు దంపతుల హత్య జరిగి ఈనెల 17తో ఏడాది పూర్తయింది. ఈ కేసులో అసలు నిందితులను వదిలేశారని ఆరోపణలున్నాయి. అయితే.. వామనరావు దంపతులకు నివాళులు అర్పిస్తూ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో వారి స్మారకార్థం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ రెండు బోర్డులను ఏర్పాటు చేశారు.
గత రెండు రోజులుగా ఆ మార్గంలో లక్షలాది మంది మేడారం జాతరకు రాకపోకలు సాగిస్తున్నారు. బోర్డులను చూస్తూ ఆనాడు జరిగిన దారుణ హత్యల ఘటనను గుర్తు చేసుకుంటూ బాధపడిన విషయాలను కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. అదే ప్రాంతంలో వామనరావు దంపతుల అభిమానులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
అయితే.. ఈ విషయాలను జీర్ణించుకోలేని కొందరు.. రాత్రికి రాత్రే ఆ ప్రచార బోర్డులను నాశనం చేశారు. ఫ్లెక్సీలను చింపివేసి, బోర్డులను సమూలంగా పెకిలించి వేసి పక్కన పడేశారు. దీనిపై వామనరావు అభిమానులు మండిపడుతున్నారు.
బహిరంగంగా కనిపించే బోర్డులు పెకిలించి వేయొచ్చేమో గాని వాస్తవాలను ఎన్నాళ్లో దాచిపెట్టలేరని.. అసలు సూత్రధారులు బయటకు వస్తారని అంటున్నారు.