బోటు బయటకు రావడం ఇప్పట్లో అసాధ్యమా..? గోదావరి దగ్గర పరిస్థితి చూస్తుంటే అలానే కనిపిస్తోంది. నదిలో మునిగిన బోటును వెతకడానికి వాడుతున్న పరికరాలేవీ గోదావరి ఎర్రనీటిలో పనిచేయడం లేదు. ఇప్పటివరకు ఇంత అడుగుకు బోటు వెళ్లడం దేశంలోనే ఇదే మొదటిసారి అని అక్కడికొచ్చి పనిచేస్తున్న బృందాలు చెబుతున్నాయి.
నది అడుగున మూడు భారీ సుడిగుండాలను గుర్తించారు. దీనివలన 50 అడుగులకు మించి గజ ఈతగాళ్లు వెళ్లలేకపోతున్నారు. దీనిపై ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ముంబై నేవీని సంప్రదించాయి. నేవీలో గజ ఈతగాడిగా పేరొందిన గౌస్‌ను ఇక్కడికి రమ్మని ప్రత్యేకంగా పిలిపించాయి. ఆయనతో పాటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రముఖ గజ ఈతగాడిగా పేరొందిన ధర్మాడి సత్యం కూడా ఇక్కడ గోదావరి గాలింపుల్లో పాల్గొంటున్నారు. వారిద్దరూ కలిసి నదిని పరిశీలించారు. ప్రస్తుతం ఎర్రనీరు, బురద భారీగా నదిలో ఉన్నందున బోటును గుర్తించడం అసాధ్యమని ధర్మాడి సత్యం అంటున్నారు.
రాజమహేంద్రవరం: సైడ్ సోనార్ స్కానర్‌తో బోటు ఆనవాలును ఓ మోస్తరుగా కనిపెట్టినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ బుధవారం ప్రకటించింది. ఆ బోటు 210 అడుగుల లోతులో ఉంది. నేవీ నిబంధనల ప్రకారం 150 మీటర్ల లోతు వరకే అనుమతి ఉంటుంది. బెలూన్ టెక్నాలజీని వినియోగించే ప్రయత్నం జరుగుతోంది. బెలూన్లతో నీటి లోపలి నుంచి ఉపరితలం దాకా బోటును లాగుతారు. తర్వాత క్రేన్ సహకారంతో గట్టు మీదకు లాగుతారు. ఐతే, అసలు అంత లోతుకు దిగి బోటుకు తాడో, గొలుసో కట్టే పరిస్థితి ఉంటేనే ఇది సాధ్యం!
గుండెలవిసేలా రోదిస్తున్న రమ్యశ్రీ తండ్రి
బోటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు రోదిస్తున్న తీరు స్థానికుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో రమ్యశ్రీ అనే యువతి గల్లంతయ్యింది. రమ్యశ్రీ తండ్రి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నాలుగు రోజులుగా కుమిలికుమిలి విలపిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఆర్నెల్లు గడవక ముందే గోదావరిలో బోటు బోల్తా ఘటనలో కుమార్తె గల్లంతు కావడాన్ని తట్టుకోలేకపోతున్నాడు. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన కారుకూరి సుదర్శన్ కుమార్తె రమ్యశ్రీ (24) విద్యుత్ శాఖలో ఏఈ. పాపికొండలు విహారానికి వెళ్లి గల్లంతయ్యింది. తండ్రి సుదర్శన్, బాబాయ్ చంద్రమౌళి నాలుగురోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరే పడిగాపులు పడుతున్నారు. మార్చురీకి వస్తున్న ప్రతీ మృతదేహాన్ని సుదర్శన్ పరిశీలిస్తూ కనిపించిన అధికారులను కన్నీటితో ప్రశ్నిస్తున్నారు. ప్రమాదంలో మరికొంతమంది వివరాలు తెలిశాయి. బసిరెడ్డి మహేశ్వరరెడ్డి (38) మృతదేహాన్ని గుర్తించారు. ఇతనిది కర్నూలు జిల్లా నంద్యాల. మరొకరు నడకుదురు శ్రీనివాస్ (21). ఇతనిది హనుమాన్ జంక్షన్. మరో మహిళ పెదిరెడ్ల దాలమ్మ (40)ది అనకాపల్లి. ఇక తెలంగాణ కాజీపేటకు చెందిన బసికి రాజేంద్రప్రసాద్ (42), హైదరాబాద్ టోలీచౌక్ ప్రాంతానికి చెందిన మహ్మద్ తాలిప్ పటేల్ (25), సాయంపేటకు చెందిన దోమల హేమంత్(28)లను గుర్తించారు.
రంజిత్ బాషా ప్రశంస
గోదావరిలో 27 మంది పర్యాటకుల ప్రాణాలు కాపాడిన షెడ్యూల్ తెగల వారికి ప్రోత్సాహం అందించనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా చెప్పారు. దీనిపై ఒక నివేదిక తనకు పంపాలని కేఆర్‌పురం ఐటీడీఏ పీవోను రంజిత్ బాషా ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో పర్యటించిన రంజిత్ బాషా ఈ సందర్భంగా ప్రాణాలకు తెగించి ప్రమాదం నుంచి ప్రయాణికుల్ని కాపాడిన గిరిపుత్రులను అభినందించారు.