బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. గోపాల్ గంజ్ లో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 20 మంది గల్లంతు అయ్యారు. గోపాల్ గంజ్లో రైతులతో వెళ్తున్న ఓ పడవ.. భగవాన్పుర్ వద్ద నదిలో బోల్తా పడింది.
దీంతో పడవలో ఉన్నవాల్లంత నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. ఇంకా 20 మందికి పైగా గల్లంతయ్యారు. సంఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ.. ఇప్పటివరకు ఒకరిని కూడా గుర్తించలేదు. అధికారులతో పాటు స్థానికంగా ఉన్నవాళ్లు కూడా సహయక చర్యల్లో పాల్గొని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రైతులు వ్యవసాయం చేసేందుకు నదిలో ఓ ఒడ్డు నుంచి మరో ఒడ్డుకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.