తప్పు అంటూ స్పష్టంగా బయటపడ్డాక కూడా వేరే వాళ్ల మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తే ఏమనాలి..? ప్రభుత్వ అధికారులూ అని అనాలి. లేదా నాయకులు అనాలి. ఎందుకంటే ఇద్దరూ ఒకటే కేటగిరి. గోదావరి పాపికొండలు పడవ మునక పాపం మాది కాదంటే, మాది కాదని మూడు శాఖల అధికారులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి సమక్షంలోనే వాదులాడుకున్నారు. రివర్స్ టెండరింగ్ వేస్తామని కేంద్రంతో వాదులాడే జగన్ సర్కార్ రివర్‌లో జరిగే ఈ ఘోర ప్రమాదానికి జ్యూడీషియల్ ఎంక్వయిరీ ఎందుకు వేయడం లేదు..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రాజమహేంద్రి: గోదావరిలో మునిగిపోయి ఘోర ప్రమాదానికి కారణమైన రాయల్ వశిష్ఠ బోటుకు అసలు ఎవరి అనుమతి ఇచ్చారనేది ప్రభుత్వానికి అంతుచిక్కడం లేదు. జిల్లా ప్రభుత్వ శాఖలు ఎవరికి వారు తమకు సంబంధం లేదని వాదించుకోవడంతో సీఎం జగన్ విస్తుపోయారు. సమీక్ష సందర్భంగా ప్రమాదానికి గురైన బోటుకు అనుమతి మేము ఇవ్వలేదంటే మేము ఇవ్వలేదని అధికారులు వాదులాడుకున్నారు. అసలు అనుమతి ఎవ్వరూ ఇవ్వకపోతే బోటు పాపికొండలకు ఎలా వెళ్లింది ? అని ఆ సందర్భంలో జగన్ వారిని నిలదీశారు. పర్యాటక బోట్లకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, లైసెన్సుల జారీ మాత్రమే తమ బాధ్యతని కాకినాడ పోర్టు అధికారులు సీయంకు వివరణ ఇచ్చుకున్నారు. పాపికొండల పర్యాటకానికి బోట్లు వెళ్లకుండా తాము వారం కిందటే అనుమతులు రద్దు చేశామని మరోపక్క పర్యాటక శాఖ సమర్ధించుకుంది. అటు నిబంధనలు సవరించి తమ అధికారాలు కత్తిరించారంటూ నీటిపారుదల శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. జగన్ జోక్యం చేసుకుని పర్యాటక బోట్లను ఎందుకు తనిఖీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.