బాహుబలి-2 రికార్డుల్ని కొట్టే సినిమా ఏదైనా ఉందా? దీన్ని కొట్టేందుకు చాలా సినిమాలు ప్రయత్నించాయి. రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ కూడా గట్టిగానే ప్రయత్నించింది. కానీ కొన్ని రికార్డుల్ని క్రాస్ చేయలేకపోయింది. అయితే ఆర్ఆర్ఆర్, బాహుబలి-2 రికార్డుల్ని కొట్టే సినిమా వస్తోందంటున్నాడు దర్శకుడు బాబి.
శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని రికార్డుల్ని బద్దలుకొడుతుందని చెబుతున్నాడు బాబి. చరణ్-శంకర్ సినిమా స్టోరీ తనకు తెలుసని, శంకర్ మేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసని, ఆ నమ్మకంతోనే ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలుకొడుతుందని చెబుతున్నానంటూ ప్రకటించాడు బాబి.
వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి వరంగల్ లో సక్సెస్ సంబరాల్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బాబి ఈ వ్యాఖ్యలు చేశాడు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి సెకెండ్ హీరోయిన్ గా చేస్తోంది. తమన్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా, వచ్చే ఏడాదికి వాయిదాపడింది.