– కారులో మృతదేహంతో ఎమ్మెల్సీ అనంతబాబు
– తన వద్ద గతంలో డ్రైవర్ గా పని చేసే వ్యక్తిగా గుర్తింపు
– అతనే చంపాడంటున్న బాధితుని తల్లిదండ్రులు
– పట్టించుకోని ప్రభుత్వం
– తమకు న్యాయం చేయాలంటున్న బాధిత కుటుంబం
– ఏపీలో సంచలనంగా మారిన ఘటన
అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడి మృతదేహం కలకలం రేపుతోంది. తనవద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్సీ అనంతబాబు కారులో తీసుకురావడం ఉద్రిక్తతకు దారితీసింది. పుట్టినరోజు ఉన్నదంటూ ఎమ్మెల్సీయే తన కొడుకును తీసుకెళ్లి కొట్టిచంపాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంటే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని ఎమ్మెల్సీ చెప్తున్నారు. కారణమేదైనా అధికారపార్టీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం ఉండటం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది.
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. గతంలో శాంతిభద్రతల అదుపులో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఏపీ.. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత బిహార్ కంటే దారుణంగా తయారయ్యిందని విరుచుకుపడ్డారు. వైసీపీ మాఫియా, వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారని ఆరోపించారు.
తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసి.. యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందన్నారు. అనంతబాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వంలో కానీ.. పోలీసుల్లో కానీ.. ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? అని ప్రశ్నించారు లోకేశ్. సుబ్రహ్మణ్యంని హత్య చేసిన అనంత బాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హత్యపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని.. లేదంటే టీడీపీ ఉద్యమాలు చేపడుతోందని హెచ్చరించారు.
ఎవరీ సుబ్రహ్మణ్యం.. ఏం జరిగింది..!
తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద సుబ్రహ్మణ్యం గతంలో కారు డ్రైవర్ గా పనిచేసాడు. కొంత కాలం క్రితం అతడు పని మానేసాడు. డ్రైవర్ గా పనిచేస్తున్న సమయంలో అవసరాల కోసం ఎమ్మెల్సీ వద్ద తీసుకున్న రూ.20వేలు బకాయి పడ్డాడు. ఈ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్సీ తన కొడుకుపై ఒత్తిడి తెచ్చేవాడని మృతుడి తల్లిదండ్రులు చెప్తున్నారు. కొంత సమయం ఇస్తే డబ్బులు తిరిగి ఇస్తామని సుబ్రమణ్యం ఎమ్మెల్సీకి చెప్పారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఎమ్మెల్సీ అనంతబాబు పుట్టినరోజు ఉండటంతో స్వయంగా ఆయనే తమ కొడుకును ఇంటినుండి తీసుకెళ్లాడని అంటున్నారు. తిరిగి ఎమ్మెల్సీయే తన కారులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకువచ్చాడని ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని.. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఎమ్మెల్సీ చెప్పాడని తెలిపారు. కానీ.. ఎమ్మెల్సీ మాటలు నమ్మశక్యంగా లేవని.. అతడే తన కొడుకును కొట్టిచంపి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బాధితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చే వరకు పోస్ట్ మార్టం చేసేది లేదని తేల్చి చెప్పారు. కానీ.. ప్రభుత్వం నుండి మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.