– లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ ఫోకస్
– అభిషేక్ రావు కస్టడీ పొడిగింపు
– కోర్టులో హాజరు.. ఇంకా విచారించాలన్న అధికారులు
– ఇప్పటిదాకా అభిషేక్ ఏం చెప్పాడు?
– రామచంద్ర పిళ్లైకి నోటీసులు జారీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన అభిషేక్ రావు నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోర్టును కోరింది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో అభిషేక్ ను గురువారం జిల్లా రూస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచింది సీబీఐ. అయితే, అభిషేక్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని.. అలాగే మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందని అధికారులు కోర్టుకు వివరించి కస్టడీ మరో రెండు రోజులు పొడిగించాలని కోరారు.
ఈ సందర్భంగా అరుణ్ రామచంద్ర పిళ్లై నోటీసులపైనా కోర్టుకు వివరించింది సీబీఐ. పిళ్లైతో అభిషేక్ కు సంబంధాలున్నాయని సీబీఐ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విచారణకు హాజరుకావాలని పిళ్లైకు నోటీసులు ఇస్తే.. తన కూతురు హాస్పిటల్ లో అడ్మిట్ అయినందున రాలేనని చెప్పినట్లుగా తెలిపారు. అయితే, అభిషేక్ తరఫు న్యాయవాది మాత్రం కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదని వాదించారు.
పోలీసు కస్టడీ అవసరం లేదని ఈ కేసులో కస్టడీ లేకుండా విచారించవచ్చని తెలిపారు. విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని రెండు రోజుల నుంచి సీబీఐ అధికారులు ఎలాంటి విచారణ జరపలేదని అందుకే కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదని వాదించారు. కానీ, కోర్టు దీన్ని తిరస్కరిస్తూ.. కస్టడీకి అనుమతించింది. అభిషేక్ ను సోమవారం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ఢిల్లీకి తీసుకొచ్చాక సీబీఐ కోర్టులో హాజరుపరిచారు.
ఇండోస్పిరిట్ ఖాతా నుంచి అభిషేక్ అకౌంట్ లోకి రూ.3.85 కోట్లు వచ్చినట్లు గుర్తించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. ఆ నగదు బదిలీకి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవని.. రెండు మూడు ఖాతాల నుంచి వచ్చిన డబ్బును అభిషేక్ వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టాడని చెప్పారు. ఆయనకు ఆ కంపెనీల్లో షేర్లు ఉన్నాయని లిక్కర్ పాలసీ విషయంలోనూ వివిధ ప్రాంతాల్లో జరిగిన మీటింగ్ లకు హాజరయ్యారని ప్రస్తావించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఐదు రోజుల కస్టడీ కోరారు. కానీ, కోర్టు మూడు రోజులకు ఓకే చెప్పింది. అది ముగియడంతో మరోసారి కోర్టులో అతడ్ని హాజరుపరిచారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం మరో రెండు రోజులు కస్టడీని పొడిగించింది.