సినీ తారల విషయంలో మీడియా ఎప్పుడూ కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూనే ఉంటుందని చెప్పడానికి తాజా సంఘటనే ఉదాహరణ. బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ కు ఎదురైన ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగిందంటే.. అలియా భట్ తన అపార్ట్ మెంట్‌లోని లివింగ్ రూమ్‌లో కూర్చొని ఉంది. అప్పుడు తనను ఎవరో గమనిస్తున్నట్లు అనుమానం కలిగింది. వెంటనే తను తలెత్తి చూడగానే, ఇద్దరు ఫోటోగ్రాఫర్లు తమ పక్కనే ఉన్న బిల్డింగ్ టెర్రస్ నుంచి ఆమెను ఫోటోలు తీస్తూ కనిపించారు. ఈ ఘటనతో ఆలియా షాక్ అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఇంట్లో ఉన్న వారిని సీక్రెట్ గా ఫోటోలు తీయడం అంటే తమ ప్రైవసీకి పూర్తి భంగం కలిగించడమేనని ఆలియా చెప్పింది. తన కూతురు రాహా కపూర్ ఫోటోల కోసమే సదరు కెమెరామెన్ హద్దులు మీరి ప్రవర్తించినట్లు వెల్లడించింది.
రణబీర్ కపూర్- ఆలియా భట్ గతేడాది మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అయిన నెలకే తాను ప్రెగ్నెంట్ అంటూ ఆలియా షాక్ ఇచ్చింది. ఇక గతేడాది చివర్లో అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమెకు రాహా కపూర్ అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. పాపతో ఆలియా బయటకు కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే పాప ఫోటోలను ఎలాగైనా సంపాదించాలని కొందరు ఫోటోగ్రాఫర్లు ప్రయత్నించారు. ఆలియా భట్ అపార్ట్ మెంట్ కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెర్రస్ మీద నుంచి ఆమె ఇంటి వైపు కెమెరాలు పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన ఆలియా పోలీసులకు సమాచారం ఇచ్చింది.
ఈ ఘటనపై ఆలియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. “నేను మధ్యాహ్నం సమయంలో ఇంట్లో కూర్చుని ఉన్నాను. ఆ సమయంలో ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్లు అనిపించింది. వెంటనే బయట వైపు చూశాను. ఒక్కసారిగా షాక్ అయ్యాను. మా పక్కింటి టెర్రస్ మీద ఇద్దరు వ్యక్తులు కెమెరాలు పట్టుకుని మా ఇంట్లోకి చూస్తున్నారు. ఈ ఘటన ముమ్మాటికీ మా ప్రైవసీని దెబ్బతీయడమే అవుతుంది. లిమిట్ క్రాస్ చేసి మా ఇంట్లోకి కెమెరాలు పెట్టారు. ఇక చాలు” అంటూ ముంబై పోలీసులకు ట్యాగ్ చేసింది.
ప్రస్తుతం ఈ ఘటన ముంబైలో సంచలనం అయ్యింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. తాము సెలబ్రిటీలు కావచ్చు.. కానీ, ఇంట్లో తమకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అలా తొంగి చూడటం ఎంతవరకు సబబు? దేనికైనా లిమిట్ ఉంటుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఘటనే గతంలోనూ జరిగింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ముద్దుల కూతురు వామిక ఫోటోలను తీయడం కోసం కొంతమంది ఫోటో గ్రాఫర్లు వాళ్ల ఇంట్లోకి చొరబడ్డారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం అయ్యింది. అనుష్క శర్మ సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ఇలాంటి పరిస్థితే ఆలియా భట్ దంపతులు ఎదుర్కొన్నారు.