కేంద్రప్రభుత్వ లెక్కల ప్రకారం 2013 చివరి నాటికి పెండింగ్‌లో ఉన్న అత్యాచార కేసుల సంఖ్య 95వేలు. 2019 చివరి నాటికి అవి లక్షా 45 వేలకు పెరిగాయి. 2021 నాటికి రెండు లక్షలకు చేరాయి. ఇంకా బయటకు రానివి ఎన్నో. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మృగాళ్ల చేతిలో ఎందరో బలవుతున్నారు. తాజాగా ముంబై, బిజ్నోర్, ఛత్తీస్ గఢ్ లలో అత్యాచార ఘటనలు జరిగాయి. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా ఎవరినీ వదలడం లేదు కామాంధులు. పాశవికంగా దారుణాలకు ఒడిగడుతున్నారు.
ముంబైలోని సకినాకా ప్రాంతంలో 32 ఏళ్ల మహిళ టెంపో లోపల అత్యాచారానికి గురైంది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడించింది. ఛత్తీస్ గఢ్, బిజ్నోర్ ఘటనలు కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే రోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచారాలపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు.
సింగర్ సోఫీ చౌద్రీ స్పందిస్తూ.. ఎంతో కోపంగా ఉంది.. అత్యాచారాలకు కఠినమైన చట్టాలు, శిక్షలు విధించే వరకు ఏదీ మారదు అంటూ పోస్ట్ చేసింది. నటి మలైకా అరోరా విరిగిన గుండె ఈమోజీని పోస్ట్ చేయగా… కరీనా కపూర్ ఇన్ స్టాలో అలాంటి ఈమోజీని పంచుకుంది. ఇక అలియా భట్ కూడా కోపంగా ఉందంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. నటి తాప్సీ పన్ను అయితే కాస్త ఘాటుగానే స్పందించింది. ఇలాంటి వార్తలు.. రోజూ వస్తూనే ఉంటాయి.. ఎందుకంటే ఆమె చాలా పోరాడింది.. అలా పోరాడినందుకు ఆమెకు దక్కిన బహుమతి ఇదంటూ రాసుకొచ్చింది.