పౌరసత్వ చట్టంపై అపోహలు-నిజాలు గురించి చర్చించేందుకు ముంబైలోని పార్క్ హయత్ హోటల్ లో బీజేపీ నిర్వహించిన సమావేశానికి చాలా మంది బాలీవుడ్ ప్రముఖలు దూరంగా ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ బైజయంత్ జే పండా ఆదివారం సాయంత్రం మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. ఈ సమావేశానికి బాలీవుడ్ లోని ప్రముఖులు జావేద్ అఖ్తర్, విక్కీ కౌషల్, ఆయుష్మాన్ ఖురానా, రవీనా టాండన్, బోనీ కపూర్, కంగనా రనౌత్, మధుర్ బండార్కర్ లతో పాటు ఇంకా చాలా మంది హాజరవుతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే వీరెవరు హాజరు కాలేదు. మీటింగ్ కు హాజరైన వారిలో నిర్మాతలు రితేష్ సిద్వాని, భూషన్ కుమార్, కూనల్ కోహ్లీ, రమేష్ తౌరానీ, రాహుల్ రవలి, సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి, సింగర్స్ షాన్, కైలాష్ ఖేర్, కంపోసర్ అనూ మాలిక్, యాక్టర్స్ రణ్ వీర్ షోరే, ఊర్వశి రౌతేలా ఉన్నారు.
యాక్టర్ రిచా చద్దా, ఫిల్మ్ మేకర్ కబీర్ ఖాన్ ముంబైలో జరిగిన పలు సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారు. అయితే బీజేపీ మీటింగ్ కు వారిని కూడా ఆహ్వానించినప్పటికీ హాజరు కాలేదు. స్వర భాస్కర్, అనురాగ్ కశ్యప్, సుశాంత్ సింగ్, నిఖిల్ అద్వానీలు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించడంతో వారికి బీజేపీ మీటింగ్ కు ఆహ్వానం అందలేదు.