ఇండియన్ సినిమా అంటూనే ఒకప్పుడు అన్నిదేశాల వారు బాలీవుడ్ అని ముక్తకంఠంతో చెప్పేవారు. అయితే ఇటీవలి కాలంలో ఆ ట్రెండ్ మారిపోయింది. సౌత్ ఇండియన్ సినిమాలు భారీగా రేంజ్ పెంచేసుకున్నాయి. మొదట్లో సౌట్ సినిమాలలో హిట్టయినవన్నీ బాలీవుడ్ దర్శక నిర్మాతలు రీమేక్ చేయడం మొదలెట్టారు. ఈ వరుసలో కూడా కోలీవుడ్, మల్లూవుడ్ లతో కంపేర్ చేస్తే మన తెలుగు సినిమాదే అగ్రతాంబూలం. అందులో ముఖ్యంగా సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలు, ప్రభుదేవా, రోహిత్ శెట్టి లాంటి దర్శకులు ముందు వరుసలో ఉండేవారు.
అయితే ఒక్కసారి దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి వచ్చాక మొత్తం సీన్ మారిపోయింది. బాహుబలి 1 & 2 ఏకంగా హిందీలో డబ్ చేసి విడుదల చెయ్యడమే కాకుండా, ఆ రెండూ భారీ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు అదేకోవలో వరుసగా ప్రభాస్ సాహో, మెగాస్టార్ చిరంజీవి “సైరా” కూడా హిందీలోకి డబ్ అయి తెలుగుతో పాటూ ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ ధరలకు అమ్ముడుపోవడం ఒక శుభపరిణామం అనే చెప్పాలి. దీంతో దేశం మొత్తం ఆయా భాషల్లోకి డబ్ అయి రిలీజ్ అవుతుండడంతో భారీగా బిజినెస్ జరగడం సినిమా నిర్మాతలకు బాగా కలిసి వచ్చే అంశంగా మారిపోయింది.
కేవలం తెలుగు, తమిళం, మళయాళం సినిమాల సక్సెస్ ను ఫాలో అవుతూ, వాటి రీమేక్ రైట్స్ కొంటూ వచ్చిన బాలీవుడ్ నిర్మాతలకు ఇప్పుడు టాలీవుడ్ మొదలుపెట్టిన ఈ బిజినెస్ ట్రెండ్ కూడా బాగా నచ్చేసినట్టుంది కాబోలు. అందుకే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలను కూడా తెలుగులోకి డబ్ చేసి ఒకేసారి ఎందుకు విడుదల చెయ్యకూడదు అనుకున్నారు. అంటే ఇంతకుముందు హిందీ సినిమాలు తెలుగులో డబ్ అయి విడుదలయ్యాయిగా అనే అనుమానం రావచ్చు. అయితే ఆ డబ్బింగ్ క్వాలిటీ చూస్తే వాటిని అలా చెప్పుకోలేం.
ఎప్పుడూ సినిమా వ్యాపారంలో కొత్త పోకడలను ఫాలో అయ్యే సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థే ఇప్పుడు మరో కొత్త సంస్కృతిని మొదలెడుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ఇప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చేస్తోన్న “దబాంగ్ 3” సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారట. అసలే సల్మాన్ ఖాన్ సినిమా, ఆపైన సురేశ్ ప్రొడక్షన్స్ వారి డబ్బింగ్ అంటే క్వాలిటీ ఎలా ఉండబోతోందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటా. డైరెక్ట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ తెప్పించేస్తారు అంటున్నారు విశ్లేషకులు. ఒక విధంగా ఇదొక ఆహ్వానించదగ్గ పరిణామమే అని చెప్పాలి. చూద్దాం ముందు ముందు ఇంకెన్ని ఇలాంటి సినిమాలు వచ్చేస్తాయో.