షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలోని బేషరమ్ రంగ్ సాంగ్ ఎంత వివాదాస్పదమైందో తెలిసిన విషయమే. హిందూ సంఘాల దగ్గర నుంచి బీజేపీ నేతల దాకా ప్రతీ ఒక్కరూ ఆ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపికా పదుకొనే ధరించిన కాషాయ రంగు బికినీపై తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగింది. అది తమ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని, ఆ సీన్లను తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. వాటిని తొలగించకపోతే సినిమానే రిలీజ్ కాకుండా నిషేధిస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షారుఖ్ ఖాన్ తన కూతురితో కలిసి ఆ సినిమా చూడాలని, వారిద్దరూ కలిసి ఆ సినిమాని చూసినట్టు ఓ ఫొటో కూడా అప్ లోడ్ చేసి ప్రపంచానికి నిరూపించాలని సవాల్ విసిరారు.
ఆ సవాలును షారుఖ్ ఖాన్ స్వీకరించాడు. తన కూతురు సుహానా ఖాన్ తోనే కాదు.. భార్య గౌరీ, తనయుడు ఆర్యన్ ఖాన్ తో కలిసి నిన్న ముంబైలో పఠాన్ సినిమాను చూశాడు. జనవరి 25వ తేదీన పఠాన్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోస్ లో ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. మూవీ రిలీజ్ అనంతరం అందరూ చాలా సంతోషంగా బయటకు వస్తూ కెమెరాలకు చిక్కారు.
అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే స్పీకర్ గిరీష్ గౌతమ్ చేసిన సవాల్ కు షారుఖ్ సమాధానం ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు.