టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్, నాలుగు పదుల వయసు దాటేసినా ఆయన ఇంకా వివాహం చేసుకోకపోవడంతో ఆయన వివాహానికి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతూ ఉంటాయి.
కొన్నాళ్ల క్రితం వరకు అనుష్కతో ఏడడుగులు వేయబోతున్నాడని, ఇప్పుడు కొత్తగా కృతి సనన్ తో ఏడు అడుగులు వేస్తున్నాడని ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ వస్తున్నాయి. కృతి సనన్ ఆయనతో కలిసి ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించడంతో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి, అది ప్రేమగా మారింది.
అంతేకాక వీరు త్వరలో ఏడడుగులు కూడా వేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇదే విషయం మీద బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. వాస్తవానికి వరుణ్ ధావన్, కృతి సనన్ కలిసి భేడియా అనే సినిమాలో నటించారు. ఈ సినిమాని తెలుగులో తోడేలు పేరుతో రిలీజ్ చేశారు.
అయితే హిందీలో వచ్చినంత పాజిటివ్ రెస్పాన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి దక్కలేదు. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేసే ఉద్దేశంతో కృతి సనన్, వరుణ్ ధావన్ అనేకమందికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
అందులో భాగంగానే తాజాగా ఒక షోలో పాల్గొన్నారు. ఆ షోలో వరుణ్ ధావన్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక వైరల్ అవుతున్న వీడియోలో కరణ్ జోహార్ వరుణ్ చెప్పిన లిస్టులో కృతి సనన్ పేరు ఎందుకు లేదు అని ప్రశ్నించగా వరుణ్ మాట్లాడుతూ కృతి పేరు ఎందుకు లేదు అని సమాధానం చెప్పేలోపే కృతి సనన్ మధ్యలో కల్పించుకుని ఏదో మాట్లాడబోతూ ఉండగా ఇంతలో వరుణ్ ధావన్ ఆమె పేరు మరొకరి మనసులో ఉందని కామెంట్ చేశాడు.
అయితే ఎవరి మనసులో ఉందని కరణ్ జోహార్ ప్రశ్నించగా ఒక వ్యక్తి మనసులో ఉంది, కానీ అతను ప్రస్తుతానికి ముంబైలో లేడు దీపికతో కలిసి షూటింగ్ చేస్తున్నాడు అంటూ కామెంట్ చేశారు. అయితే దీపికా పడుకొనే ప్రస్తుతం ప్రాజెక్టు K షూటింగ్లో భాగంగా ప్రభాస్ తో షూట్ చేస్తూ ఉండడంతో కృతి సనన్ ప్రభాస్ మనసులో ఉందంటూ వరుణ్ ధావన్ కామెంట్ చేసినట్లయింది. దానికి కృతి సనన్ సిగ్గుపడుతున్నట్లు ఆ వీడియోలో కూడా కనిపిస్తోంది.
అయితే ఇది ప్రమోషన్ స్టంట్ ఆ లేక నిజంగానే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా? అనే విషయం మీద క్లారిటీ లేదు. నిజానికి ఈ తోడేలు సినిమాకి పాజిటివ్ రివ్యూస్ కేవలం హిందీ నుంచి వచ్చాయి గానీ తెలుగు వారు పెద్దగా సినిమాని ఆదరించలేదు. దీంతో తెలుగులో కూడా సినిమాని కాస్త ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతో ఇలా ప్రభాస్ పేరును కావాలనే లాగానే వాదన కూడా వినిపిస్తోంది.