మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో జరగబోయే ఓ ఫ్యాషన్ షోలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఆదివారం పాల్గోనున్నారు. దీని కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాషన్ షో జరిగే ప్రాంతానికి అత్యంత సమీపంలో ఈ రోజు బాంబు పేలుడు ఘటన కలకలం రేపుతోంది.
మణిపూర్ రాజధాని ఇంపాల్ లోని కంగ్ జై బాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్యాషన్ షో వేదికకు 100 మీటర్ల దూరంలో పేలుడు సంభవించినట్టు అధికారులు చెప్పారు. ఉదయం 6.30 గంటల ప్రాతంలో పేలుడు సంభవించిందని తెలిపారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఐఈడీ లేదా గ్రెనేడ్ వల్ల ఈ పేలుడు సంభవించి ఉంటుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఈ పేలుడుకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ ముందుకు రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఫ్యాషన్ షోను కొన్ని గ్రూపులు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ గ్రూపులు ఈ ఘటనకు కారణమై ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.
ఇంపాల్ లో రేపు ఉదయం ఫ్యాషన్ షోను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మణిపూర్ ఖాదీ, చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించే ఉద్దేశంతోనే ఈ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నారు. దీనికి సన్నిలియోన్ హాజరుకానున్నారు.